నిండు గర్భిణికి రైలెక్కించి, పారిపోయిన భర్త.. రైలులోనే ప్రసవించిన భార్య...చివరికి...
బెంగళూరు నుంచి బీహార్ కు వెడుతున్న ఓ నిండు గర్భిణి యశ్వంతపుర ఎక్స్ప్రెస్ లో ప్రసవించింది. ఆమెను రైలు ఎక్కించిన భర్త.. తాను ఎక్కకుండా పరారయ్యాడు.

సూళ్లూరుపేట : ఓ నిండు గర్భిణీ రైలులోనే ప్రసవించింది. ఇలాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగు చూస్తూనే ఉంటాయి. రైలులో, బస్సులో ప్రయాణం చేస్తున్న సమయంలో పురిటినొప్పులు రావడం అక్కడే ప్రసవించిన ఘటనలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సొంత ఊరికి వెళదామని చెప్పి నిండు గర్భిణీ అయిన భార్యని, భర్తే స్వయంగా రైలు ఎక్కించి.. ఎప్పుడైనా ప్రసవం రావచ్చన్న ఇంగిత జ్ఞానం లేకుండా పారిపోయాడు.
గర్భిణీతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. భార్యను రైలు ఎక్కించిన భర్త.. మంచినీళ్లు తెస్తానని చెప్పి, తిరిగి రాలేదు. ఇంతలో రైలు కదలడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆమె అలాగే ఉండిపోయింది. దీనికి సంబంధించిన వివరాలలోకి వెళితే.. బీహార్ కి చెందిన యాబాబీ, మదీనా భార్య భర్తలు, వీరికిద్దరు ఆడపిల్లలు. బీహార్ నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడే జీవనోపాధి చూసుకున్నారు. ప్రస్తుతం మదీనా నిండు గర్భిణీ. ఎప్పుడైనా ప్రసవం వచ్చేలా ఉంది.
ఏపీ ఎన్నికలు పేదలు-పెట్టుబడిదారులకు మధ్య జరిగే యుద్ధం.. : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
దీంతో భర్త తమ సొంతూరు బీహార్ కి వెళ్దామని చెప్పాడు. గురువారం పిల్లలతో కలిసి బెంగుళూరు రైల్వే స్టేషన్ కు వీరంతా వచ్చారు. ఆ తర్వాత భార్య, పిల్లలను యశ్వంతపుర ఎక్స్ప్రెస్ లో ఎక్కించాడు. తాగడానికి మంచినీరు తెస్తానంటూ భర్త వెళ్ళాడు. ఎంతసేపటికి అతను తిరిగి రాలేదు. ఇంతలో రైలు కదిలిపోయింది. మదీనా ఏం చేయాలో తెలియక ఇద్దరు పిల్లలతో రైలులోనే ఉండిపోయింది.
యశ్వంతపుర ఎక్స్ప్రెస్ ఏపీ మీదుగా వెళుతుంది. అలా సూళ్లూరుపేట, చెన్నై స్టేషన్లో మధ్య ఉన్న పొన్నేరికి చేరుకునేసరికి మదీనాకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. ఇది గమనించిన భోగి లోని తోటి ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. వారు రైల్వే అధికారులను అప్రమత్తం చేశారు. రైలు సూళ్లూరుపేట వచ్చేసరికి మదీనా రైలులోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రైల్వే అధికారుల సమాచారంతో అప్రమత్తమైన వైద్య సిబ్బంది సూళ్లూరుపేట స్టేషన్లో 108 వాహనాన్ని సిద్ధంగా ఉంచారు.
రైలు సూళ్లూరుపేట చేరుకునేసరికి మదీనా ప్రసవించడంతో 108 సిబ్బంది ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు ఆమె భర్త గురించి విచారించగా…ఇంతకుముందే తనకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టడంతో భర్త తనను ఇష్టపడడం లేదని.. ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని అనుమానించాడని.. అందుకే తనను రైలు ఎక్కించి పారిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది.
ఆమె చెప్పిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు భర్తను రప్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే, యశ్వంతపుర ఎక్స్ప్రెస్ సూళ్లూరుపేటలో స్టాపింగ్ లేదు. కానీ, మదీనా ఘటనతో ఉదయం 853 నుంచి 9.05 నిమిషాల వరకు.. అక్కడ ఆగింది. ప్రస్తుతం మదీనా, నవజాత శిశువు ఆరోగ్యంగానే ఉన్నారు. ఆమె తన ముగ్గురు పిల్లలతో సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రిలోనే ఉంది.