ఒకరికి మరొకరు తోడు ఉంటామని ప్రమాణం చేసుకున్నారు. ఆ పెళ్లినాటి ప్రమాణాలను మర్చిపోయారు. ఒకరిపై మరొకరు మనస్పర్థలు తెచ్చుకున్నారు. చివరకు భార్య చేతిలో భర్త హతమయ్యాడు. ఈ సంఘటన కడప జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కడప నగరంలోని అక్కాయపల్లె శాస్త్రినగర్ కి చెందిన సబ్బరాయుడు, నారాయణమ్మల రెండో కుమారుడు కిరణ్ కి... 11సంవత్సరాల క్రితం తులసి(28) తో వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే.. గతేడాది నుంచి భార్యభర్తల మధ్య మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. పెద్దల సమక్షంలో పంచాయతీ కూడా పెట్టారు. అయినా.. వారిద్దరి మధ్య మనస్పర్థలు తగ్గలేదు.

కాగా.. ఇటీవల తులసి ఓ బ్యటీపార్లర్ లో పనికి చేరింది. కిరణ్ కార్పెంటర్ గా పనులు చేస్తూ ఉండేవాడు. కాగా.. ఇటీవల మళ్లీ భార్యభర్తల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. ఈక్రమంలో నాలుగురోజులుగా తులసిని, ప్రవర్తన సరిగా లేదని, మార్చుకోవాలని కిరణ్‌కుమార్‌ గొడవపడేవాడు.

ఈనెల 3వ తేదీ రాత్రి ఇద్దరి మధ్య గొడవ పెద్దదిగా మారింది. కిరణ్‌కుమార్‌ తన భార్యను జుట్టుపట్టుకుని, ముందుకు లాగి కొడుతుండగా, భార్య తులసి తన చేతిలోని కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో భర్త మర్మాంగాల వద్ద తీవ్రగాయమవడంతో రక్తపుమడుగులో పడిపోయాడు. ఈ సంఘటనపై సమాచారాన్ని బ్యూటీపార్లర్‌ యజమాని ఆస్మ, మృతుని తల్లి నారాయణమ్మకు ఫోన్‌ చేసి తెలియజేశారు. 

సంఘటనస్థలానికి చేరుకున్న నారాయణమ్మ, కుటుంబసభ్యులు కిరణ్‌కుమార్‌ రక్తపుమడుగులో విగతజీవుడిగా మారిపోయి ఉండటాన్ని గమనించి, తీవ్రంగా విలపించారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన వల్ల తల్లిదండ్రులు దూరమైన కుమారులు జీవన్‌ ఆచారి, సుశాంత్‌లు పోలీసులకు, బంధువులకు సంఘటన జరిగిన విషయాన్ని తెలియజేశారు. ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తల్లి చేతి కత్తికి తండ్రి బలయ్యాడని తెలిపారు.