చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ మహిళ మంత్రగాడిని ఆశ్రయించి ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలం వీర్నమల పంచాయతీ కుల్లిగానూరుకు చెందిన పవనమ్మ గత ఆరు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.

ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగినా.. ఎందరో వైద్యులను సంప్రదించినా ఆమె ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో కుప్పంకు చెందిన హకీమ్‌ అక్బర్‌ అనే మంత్రగాడిని సంప్రదించారు. దీంతో పూజల కోసం మూడు రోజుల పాటు ఆ మహిళ ఆ మంత్రగాడి ఇంట్లోనే ఉన్నారు.

ఇంతలోనే ఏం జరిగిందో కానీ.. మంత్రగాడి ఇంటి పక్కనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గోపినగర్‌ సమీప వ్యవసాయ పొలాల్లో ఈ ఘటన జరగ్గా... గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని కారులో బాధితురాలి ఇంటికి తరలించారు.

మంత్రగాడి కారణంగానే పవనమ్మ ఆత్మహత్యకు పాల్పడ్డారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.