దారుణం: వివాహితతో మూడేళ్ళుగా సహజీవనం, ట్విస్టిచ్చిన ప్రియుడు

Woman commits suicide along with her two children
Highlights

వివాహితకు షాకిచ్చిన ప్రియుడు

గుంటూరు:పెళ్ళి చేసుకొంటానని నమ్మించి మూడేళ్ళుగా సహాజీవనం చేసి మరో యువతిని వివాహం చేసుకోవడం భరించలేని వివాహిత తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన గుంటూరు జిల్లా పొన్నూరులో తీవ్ర విషాదాన్ని నింపింది.

గుంటూరు జిల్లా పొన్నూరు ఆర్టీసీ డిపోకు సమీపంలోని ఓ ఇంటిలో శారద  తన ఇద్దరు పిల్లలతో నివాసం ఉంటుంది. 12 ఏళ్ళ క్రితం ఉదయ్ కుమార్ తో శారదకు వివాహమైంది. వారిద్దరికీ ఓ కొడుకు, ఓ కూతురు ఉన్నారు. ఉదయ్ కుమార్ హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. శారద నాలుగేళ్ళుగా పొన్నూరులోని స్కూల్‌లో టీచర్ గా పనిచేసేది. అయితే నాలుగేళ్ళ క్రితం ఉదయ్ కుమార్ గుండెపోటుతో మరణించాడు.


అయితే ఈ క్రమంలోనే జూపూడి గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బొడ్డు కోటేశ్వర రావుతో ఆమెకు పరిచయమైంది. ఈ పరిచయం వారి మద్య ప్రేమకు కారణమైంది. శారదను వివాహం చేసుకొంటానని కోటేశ్వరరావు నమ్మించాడు. ఇద్దరూ మూడేళ్ళుగా సహాజీవనం చేస్తున్నారు. అయితే పెళ్ళి విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా దాటేస్తున్నాడు. అయితే కోటేశ్వరరావును వివాహం చేసుకొంటానని అత్త, మామలతో పాటు తల్లిదండ్రులకు ఆమె చెప్పింది.

వారితో విబేధించి వారికి దూరంగా పొన్నూరు ఆర్టీసీ బస్ డిపోకు సమీపంలోని ఓ ఇల్లును అద్దెకు తీసుకొని నివాసం ఉంటుంది. అయితే ఇదే సమయంలో కోటేశ్వరరావుకు యాజలి గ్రామానికి చెందిన యువతితో వివాహం కుదిరింది.

ఈ విషయం తెలిసిన శారద కోటేశ్వరరావును నిలదీసింది. అయినా కోటేశ్వరరావు మాత్రం మారలేదు. గురువారం నాడు కోటేశ్వరరావుకు యాజలిలో మరో యువతితో వివాహం జరిగింది. ఈ విషయం తెలిసిన శారద కోటేశ్వరరావుతో ఫోన్ లో గొడవ పెట్టుకొంది. 


అర్దరాత్రి సమయంలో  గ్యాస్ లీక్ చేసుకొని నిప్పటించుకొంది. దీంతో ఇద్దరు పిల్లలతో సహా ఆమె సజీవ దహనమైంది.శారద తల్లిదండ్రులు కోటేశ్వరరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. శారద మృతికి కోటేశ్వరరావే కారణమని శారద తండ్రి ఆరోపించారు. పోస్టుమార్టమ్ అనంతరం మృతదేహలను కుటుంబసభ్యులకు అప్పగించారు పోలీసులు.

loader