ఆమె చేతికి పెట్టిన గోరింటాకు పోలేదు.. కాళ్ల రాసిన పారాణి ఆరలేదు. ఇంటికి కట్టిన తోరణాలు వాడిపోలేదు.. కానీ.. ఆమె మాత్రం ప్రాణాలు వదిలేసింది. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ఏడిద సీతానగరానికి చెందిన మహాదాసు రమ్య శ్రీదేవి(20) కి మూడు రోజుల కిందట పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం లక్ష్మణపురం గ్రామానికి చెందిన వ్యక్తితో బుధవారం పెళ్లి జరిగింది. వరుడు ఆమెకు స్వయానా మేనమమా కావడం గమనార్హం. అయితే.. పెళ్లైన మూడోరోజే రమ్య ఎలకల మందు తిని ఆత్మహత్య చేసుకుంది.

గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా.. చదువుకోవాలనే ఆమె ఆశను చంపేసి.. బలవంతంగా పెళ్లి చేయడం వల్లే రమ్య ఆత్మహత్యకు పాల్పడిందని భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.