ఓ మహిళను దారుణంగా హత్య చేసి, ఆ తరువాత చేయి నరికి ఎత్తుకెళ్లిన సంఘటన నిజామాబాద్‌లో జరిగింది. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి ఆవరణలో ఆదివారం అర్ధరాత్రి వెలుగు చూసిన ఈ అమానుష ఘటనలో పోలీసుల కథనం ప్రకారం.. ఆస్పత్రి ఆవరణలోని మార్చురీ విభాగం ఎదుట మహిళా మృతదేహం ఉండటాన్ని సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. 

వెంటనే వైద్యాధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు విచారణ చేపట్టారు. మృతదేహాన్ని నగరంలోని గోసంగి కాలనీకి చెందిన శైలజ (28)గా గుర్తించారు. చేతిని నరకడంతో తీవ్ర రక్తస్రావం అయి ఘటనా స్థలంలోనే మహిళ మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. 

కాగా, రాత్రి 10 గంటల సమయంలో తన భార్య ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లినట్లు భర్త శివానంద్‌ పోలీసులకు తెలిపారు. ఈ హత్య కేసులో ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళను వేరేచోట హత్య చేసి ఇక్కడ పడేసినట్లు అనుమానిస్తున్నారు. 

‘చేతిని నరికితే తీవ్ర రక్తస్రావం అవుతుంది. అయితే..మృతదేహం వద్ద పెద్దగా రక్తం లేదు. ఎక్కడో చంపి ఇక్కడ పడేసి ఉంటారు’ అని ఓ పోలీసు అధికారి చెప్పారు. ఆస్పత్రి చుట్టుపక్కల డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించినా ఫలితం దక్కలేదు. ఆదివారం రాత్రి ఆస్పత్రిలోకి ఎవరెవరు ప్రవేశించారు. మార్చురీ వైపు ఏ మైన వాహనాలు వెళ్లాయా..? అనే కోణాలపై సీసీ కెమెరాల్లో పరిశీలిస్తున్నారు. 

అయితే.. కొన్నిచోట్ల సీసీ కెమెరాలు పనిచేయడం లేదని పోలీ సులు గుర్తించారు. మహిళకు సంబంధించిన ఫోన్‌ కాల్స్, ఎవరైన శత్రువులు ఉన్నారా అని అతని కుటుంబీకుల ద్వారా విచారణ చేపడుతున్నారు. ఆస్పత్రి వెనుక భాగంలో మహిళ మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసిన ఘటన ఎస్‌పీఎఫ్‌ దృష్టికి రాకపోవడం విశేషం.