రెండు ప్రధాన పార్టీల అధినేతల క్యాంపుతో నంద్యాల నియోజకవర్గం ఉడికిపోతోంది. జగన్ క్యాంపుకు తోడు చంద్రబాబు కూడా శని, ఆదివారాల్లో నంద్యాలలోనే క్యాంపు వేయనున్నారు. 9వ తేదీ నుండి జగన్ ప్రారంభించిన రోడ్డుషోలతో వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. రెండు రోజుల పాటు చంద్రబాబు నంద్యాలలోనే క్యాంపు వేస్తున్నారు. నంద్యాల రూరల్ మండలంలో రోడ్డుషోల్లో పాల్గొనటంతో పాటు రాత్రికి ఓ ప్రైవేటు హోటల్లో బసచేసి పరిస్ధితిని సమీక్షించి గెలుపు వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
రెండు ప్రధాన పార్టీల అధినేతల క్యాంపుతో నంద్యాల నియోజకవర్గం ఉడికిపోతోంది. జగన్ క్యాంపుకు తోడు చంద్రబాబు కూడా శని, ఆదివారాల్లో నంద్యాలలోనే క్యాంపు వేయనున్నారు. నంద్యాలలో టిడిపి, వైసీపీ అభ్యర్ధుల ప్రచారం రెండు నెలల క్రితమే ప్రారంభమైనా అసలైన వేడి మాత్రం మొన్నటి 3వ తేదీనే మొదలైంది.
బహిరంగసభలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబునాయుడుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే కారణం. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ప్రచారంలో ఒక్కసారిగా వేడిపుట్టింది. సరే, చంద్రబాబును జగన్ అన్నిమాటలన్నాక మంత్రులు, నేతలు ఊరుకుంటారా? వారూ జగన్ పై ఎదురుదాడి మొదలుపెట్టారు.
9వ తేదీ నుండి జగన్ ప్రారంభించిన రోడ్డుషోలతో వైసీపీ ప్రచారంలో దూసుకుపోతోంది. జగన్ దెబ్బకు టిడిపి ఆత్మరక్షణలో పడిపోయింది. గెలుపు కోసం నానా అవస్తలు పడుతోంది. ఉపఎన్నికలో సులభంగా గెలవాల్సిన అధికారపార్టీ, వైసీపీ దెబ్బకు తల్లక్రిందులైపోతోంది. అందుకనే అరాచకాలకు తెరలేపింది. వైసీపీ నేతలపై దాడులు చేయటం, వైసీపీ కౌన్సిలర్ల ఇళ్ళు, వ్యాపారాలపై దాడులు చేయటం ఇందులో భాగమే.
ప్రచారంలో ఊపుకోసమే స్టార్ క్యాంపైనర్ అంటూ చంద్రబాబు బావమరిది కమ్ సినీనటుడు కమ్ హిందుపురం ఎంఎల్ఏ నందమూరిబాలకృష్ణను రంగంలోకి దింపింది. అయినా ఉపయోగం కనబడలేదు. ప్రచారానికి ఇక మిగిలింది మూడు రోజులే ఉండటంతో చంద్రబాబు కూడా నంద్యాలలో 19, 20 తేదీల్లో క్యాంపు వేస్తున్నారు.
రెండు రోజుల ప్రచారంతో పార్టీ విజయావకాశాలను అమాంతం పెంచటంతో పాటు తెరవెనుక మంత్రాంగంతో టిడిపిని గెలిపించాలన్నది ముఖ్యమంత్రి పట్టుదల.
వైసీపీ అభ్యర్ధి శిల్పామోహన్ రెడ్డిదే విజయమని ఇంటెలిజెన్స్ నివేదికలన్నీ చెబుతున్నాయనే ప్రచారం ఊపందుకున్నది. అందుకనే రెండు రోజుల పాటు చంద్రబాబు నంద్యాలలోనే క్యాంపు వేస్తున్నారు. నంద్యాల రూరల్ మండలంలో రోడ్డుషోల్లో పాల్గొనటంతో పాటు రాత్రికి ఓ ప్రైవేటు హోటల్లో బసచేసి పరిస్ధితిని సమీక్షించి గెలుపు వ్యూహాన్ని ఖరారు చేయనున్నారు.
ఇప్పటికే నంద్యాల రూరల్, గోస్పాడు మండలాల్లో రోడ్డుషోలు పూర్తి చేసిన జగన్ గురువారం నుండి పట్టణంలో ఇంటింటి ప్రచారంతో అదరగొట్టేస్తున్నారు. అంటే మరో రెండు రోజుల పాటు జగన్ కూడా నంద్యాల కేంద్రంలోనే ఉంటారు. ఇద్దరు అధినేతల ప్రచారం, సమీక్షలతో శని, ఆదివారాలు నియోజకవర్గం మొత్తం అట్టుడికిపోవటం ఖాయం. గతంలో ఏ నియోజకవర్గంలోని ప్రజలూ ఎదురుచూడని పరిణామాలు నంద్యాల ప్రజలకు అనుభవంలోకి రానున్నది.
