మైలవరంలో దొంగలు పడ్డారు. ఏ ఇంట్లోనో చొరబడి డబ్బులు, బంగారం దోచుకోవడం కాదు... ఏకంగా ప్రభుత్వ వైన్ షాపులనే టార్గెట్ చేసి లక్షల విలువైన మద్యాన్ని దొంగిలించారు.
విజయవాడ : కృష్ణా జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా ప్రభుత్వ వైన్ షాపులనే టార్గెట్ చేసిన కేటుగాళ్లు భారీగా మద్యాన్ని దొంగిలించారు. ఒకే రాత్రి రెండు వైన్ షాప్ లను కొల్లగొట్టి లక్షల విలువచేసే మద్యంతో ఉడాయించారు. ఉదయం వైన్ షాప్ తెరవగానే దొంగతనం జరిగినట్లు గుర్తించిన సిబ్బంది ఎక్సైజ్ ఉన్నతాధికారులు, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మైలవరం బైపాస్ రోడ్డులో వాక్ ఇన్ వైన్ షాప్ ను ప్రభుత్వం నిర్వహిస్తోంది. అలాగే పశువుల హాస్పిటల్ సమీపంలో మరో ప్రభుత్వ వైన్ షాప్ వుంది. ఈ రెండు వైన్స్ లలో గత అర్ధరాత్రి దొంగలుపడ్డారు. అత్యంత చాకచక్యంగా వైన్ షాపుల్లోకి ప్రవేశించిన దొంగలు మద్యం బాటిల్స్ ఎత్తుకుపోయారు.
వైన్ షాప్స్ పైకప్పు రేకులను కత్తిరించిన దొంగలు లోపలికి ప్రవేశించారు. మద్యం బాటిల్స్ ను కూడా అందులోంచే బయటకు తరలించారు. ఇలా రెండు షాపుల్లో కలిపి దాదాపు రూ.2,20,000 వేల విలువచేసే మద్యాన్ని దొంగిలించినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
Also Read తిరుపతి జూపార్క్ లో విషాదం: సెల్ఫీ కోసం ఎన్‌క్లోజర్‌లోకి, సింహం దాడిలో వ్యక్తి మృతి
ఉదయం వైన్స్ తెరిచేవరకు దొంగతనం జరిగినట్లు బయటపడలేదు. సిబ్బంది షటర్ తెరవగానే పైకప్పుకు పెద్ద కన్నం వుండటాన్ని గమనించారు. అలాగే కాటన్ల కొద్ది మద్యం కనిపించకపోవడంతో దొంగతనం జరిగినట్లు నిర్దారించుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే దొంగతనం జరిగిన రెండు వైన్స్ లను పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మద్యం దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది తాగుబోతు దొంగల పనిగా అనుమానిస్తున్నారు.
వీడియో
