వైసీపీలో ఆ 11 మంది కూడా మిగలరా?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా వుంది ప్రస్తుతం వైసిపి అధినేత వైఎస్ జగన్ పరిస్థితి. ఇప్పటికే ఓటమిబాధలో వున్న ఆయనను సన్నిహితుల రాజీనామాలు మరింత కలవరపెడుతున్నాయి. తాజాగా జగన్ కు సన్నిహితుడిగా పేరున్న ఎంపీ ఒకరు రాజీనామాకు సిద్దమయ్యారు. 

Will YSRCP Last 11 Members Stay? Party Faces Major Exodus Amid Political Shifts AKP

2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో చావు తప్పి కన్ను లొట్టపోయినట్లుగా వుంది వైసిపి పరిస్థితి. 175 కు 175 సీట్లు మావే, సిద్దమా అంటూ ఎన్నికలకు వెళ్లింది వైసిపి...  ఆ పార్టీ నాయకులు ధీమాచూస్తే మళ్లీ గెలుస్తుందేమో అనిపించింది. తీరా ఫలితాలను చూస్తే 11 సీట్లకు పరిమితం అయ్యింది. 151 సీట్ల నుండి అమాంతం 11 సీట్లకు పడిపోయింది వైసిపి బలం. తాజా పరిస్థితులు చూస్తుంటే వైసిపిలో జగన్ ఒక్కరే మిగిలిపోతారా? మిగతా 10మంది కూడా జంప్ అవుతారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. 

ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీలోకి వలసలు కొనసాగడం ప్రస్తుత రాజకీయాల్లో పరిపాటిగా మారింది. 2014-19 వరకు వైసిపి లోంచి టిడిపిలోకి, 2019-24 వరకు టిడిపి లోంచి వైసిపిలోకి నాయకుల వలసలు కొనసాగాయి. ఇప్పుడు మళ్ళీ వైసిపి వంతు వచ్చింది... ఈసారి ఒక్క టిడిపిలోకే కాదు జనసేన పార్టీలోకి కూడా నాయకులు జంప్ అవుతున్నారు. ఇంతకాలం క్షేత్రస్థాయిలో కౌన్సిలర్ల, కార్పోరేటర్లతో ప్రారంభమైన వలసలు తాజాగా ఉపందుకుని ఎంపీలు,ఎమ్మెల్సీలకు చేరుకున్నారు. త్వరలోనే వైసిపి ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో నడిచే అవకాశాలున్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

తాజా రాజకీయ పరిణామాలు చూస్తుంటే వైసిపికి ముందుముందు ఇంకా గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా కనిపిస్తోంది. స్వయంగా ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు వైసిపిలోంచి చేరికలపై ఆసక్తికర కామెంట్స్ చేసారు. వైసిపిలోంచి టిడిపిలో చేరాలనుకునే ఏ నాయకుడైనా ఆ పార్టీ సభ్యత్వానికే కాదు పదవికి కూడా రాజీనామా చేయాలనే కండిషన్ పెట్టారు. అంటే వైసిపి నాయకులను చేర్చుకునేందుకు చంద్రబాబు సిద్దంగా వున్నారని... వైసిపి వాళ్లు కూడా ఆయనతో టచ్ లో వున్నారనే విషయం అర్థమవుతోంది. 

చంద్రబాబు గేట్లెత్తారు కాబట్టి ఇకపై వైసిపిలోంచి భారీ వలసలు వుంటాయని టిడిపి నాయకులు చెబుతున్నారు. అందుకు తగినట్లుగానే రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేసారు. పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా సునీత రాజీనామా చేసారు. త్వరలోనే ఆమె టిడిపిలో చేరనున్నట్లు...అందుకోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ షాక్ నుండి   తేరుకునేలోపే వైసిపికి మరో షాక్ తగిలింది.... మరో ఇద్దరు ఎంపీలు కూడా రాజీనామాకు సిద్దమయ్యారు.  

వైసిపి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజీనామాకు సిద్దమయ్యారు. వైసిపి సభ్యత్వంలో పాటు రాజ్యసభ పదవికి కూడా రాజీనామా చేస్తున్నారు. రాజ్యసభ ఛైర్మన్ అపాయింట్ మెంట్ కూడా తీసుకున్న వీరిద్దరు రాజీనామా సమర్పించనున్నారు. అలాగే పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కూడా రాజీనామా లేఖను పంపించనున్నట్లు సమాచారం. త్వరలోనే వీరద్దరు టిడిపి గూటికి చేరనున్నారని... ఇప్పటికే ఆ పార్టీ నాయకులతో సంప్రదింపులు కూడా పూర్తయినట్లు ప్రచారం జరుగుతోంది. 

అయితే కేవలం ఈ ఇద్దరితోనే ఈ రాజీనామాలపర్వం ముగియడం లేదు... మరికొందరు రాజ్యసభ ఎంపీలు కూడా అదే బాటలో నడవనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, ఆర్‌ .కృష్ణయ్య కూడా పార్టీని వీడేందుకు సిద్దమైనట్లు సమాచారం.వీరంతా రాజీనామా చేస్తే రాజ్యసభలో వైసిపి బలం 11 నుండి 4 కు పడిపోతుంది. ఆ పార్టీలో ఇక మిగిలేది వైవి సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి, నిరంజన్ రెడ్డి, పరిమల్ నత్వాని. 

తాజాగా పార్టీ వీడుతున్న మోపిదేవి వెంకటరమణ వైసిపి అధినేత వైఎస్ జగన్ కు చాలా సన్నిహితులు. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి లాంటివారు కూడా వైసిపి అధినేతతో సన్నిహితంగా వుండేవారే. అలాంటివారే పార్టీకి రాజీనామా చేస్తున్నారంటే మిగతావారు వుంటారా? అనే అనుమానం కలుగుతోంది. ఈ పరిస్థితి చూస్తుంటే వైసిపి ఖాళీ కావడం ఖాయంగా కనిపిస్తోంది. మూలిగె నక్కపై తాటిపండు పడ్డట్లు అసలే ఓటమిబాధలో వున్న వైఎస్ జగన్ కు ఈ వలసలు మరింత బాధించేలా వున్నాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios