జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న కేసులు కూడా వీగిపోయేట్లే ఉన్నాయి.
జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్వరలో వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన ఉన్న కేసులు కూడా వీగిపోయేట్లే ఉన్నాయి. ఎందుకంటే, దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఏ కేసులో కూడా సిబిఐ వాదనలు కోర్టుల్లో నెగ్గటం లేదు. తాజా కేసులనే తీసుకుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి. యూపిఏ హయాంలో దేశంలో సంచలనం కలిగించిన 2 జి స్పెక్ట్రమ్ కేసును కోర్టు విచారించింది. అయితే, సరైన ఆధారాలను చూపలేకపోయిందంటూ గురువారమే కేసులను కొట్టేసింది.
ఇక, తాజా కేసు తీసుకుంటే ముంబయ్ కేంద్రంగా సంచలనం కలిగించిన ‘ఆదర్శ హౌసింగ్ స్కాం’ లోకూడా సిబిఐ వాదనలు వీగిపోయాయి. అంటే ఇందులో తీర్పేమీ రాలేదనుకోండి. కాకపోతే మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ప్రాసిక్యూషన్ కు గవర్నర్ ఇచ్చిన అనుమతిని కోర్టు అడ్డుకుంది. మాజీ ముఖ్యమంత్రిని విచారించాల్సిందే అంటూ సిబిఐ చేసిన వాదనలను కోర్టు కొట్టేసింది.
ఇక, ప్రస్తుత విషయానికి వస్తే జగన్ పైన కూడా దాదాపు ఐదు సంవత్సరాలుగా అనేక అక్రమాస్తుల కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసులన్నింటినీ సిబిఐ నమోదు చేసింది. సంవత్సరాలుగా కేసుల విచారణ సాగుతోంది కాని ఏ ఒక్క కేసు కూడా ఫైనల్ కాలేదు. అక్రమాల్లో, అవినీతిలో భాగస్తులంటూ సిబిఐ జగన్ తో సహా కొందరు మంత్రులు, ఐఏఎస్ అధికారులు, పలు సంస్ధల యాజమన్యాలపై కేసులు నమోదు చేయటమే కాకుండా అరెస్టులు కూడా చేసింది.
అయితే, వారిలో చాలామంది ఐఏఎస్ అధికారులపై ఉన్న అవినీతి, అక్రమాల ఆరోపణలపై ఆధారాలు లేవంటూ పలుకేసులను కోర్టు కొట్టేసింది. ఇక, మంత్రులకెవరికీ ఎటువంటి సంబంధం లేదని మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే మంత్రివర్గం తేల్చేసింది. కాబట్టి మంత్రుల పాత్ర కూడా పెద్దగా లేనట్లే.
అదే విధంగా, వివిధ సంస్ధల యాజమాన్యాలకు వ్యతిరేకంగా సిబిఐ సరైన ఆధారాలను సమర్పించలేకపోతోంది. ఇటువంటి నేపధ్యంలోనే జగన్ పై ఉన్న కేసులను మాత్రం సిబిఐ ఏ విధంగా నిరూపించగలుగుతుందనే అనుమానాలు సర్వత్రా మొదలయ్యాయి. ఎందుకంటే, జరిగిన అవినీతిలో మంత్రులకు పాత్ర లేక, ఐఏఎస్ అధికారులకూ సంబంధం లేకపోతే ఇక అవినీతి జరిగిందెక్కడ? జరగని అవినీతిలో జగన్ పాత్ర ఎలాగుంటుంది? అందుకే తనపై నమోదైన కేసులన్నీ కేవలం రాజకీయ కక్షసాధింపు కేసులే అంటూ జగన్ ఎప్పటి నుండో మొత్తుకుంటున్నారు. చివరకు అదే నిజమవుతుందేమో?
