తిరుపతి లోకసభ ఉప ఎన్నిక: జగన్ ధీమా, చంద్రబాబులో గుబులు, కారణం ఇదీ...
తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో మున్సిపాలిటీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ప్రతిఫలిస్తాయా అనే చర్చ సాగుతోంది. మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో జగన్ లో విశ్వాసం వ్యక్తమవుతుండగా చంద్రబాబు నిరాశలో మునిగినట్లు చెబుతున్నారు.
తిరుపతి: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ ప్రతిఫలిస్తాయా అనే చర్చ తాజాగా ముందుకు వచ్చింది. ఈ స్థితిలో ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ లో విశ్వాసాన్ని పెంచగా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి గుండెల్లో గుబులు పుట్టిస్తోందని అంటున్నారు. తిరుపతి లోకసభ నియోజకవర్గంలోని ఓ కార్పోరేషన్ ను, మూడు మున్సిపాలిటీలను కూడా వైసీపీ కైవసం చేసుకుంది.
భారీ మెజారిటీతో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. తిరుపతి కార్పోరేషన్ ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ సాధించిన ఓట్ల కన్నా వైసీపీ రెట్టింపు ఓట్లను పొందింది. టీడీపీ గానీ బిజెపి, జనసేన కూటమి గానీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. తిరుపతి లోకసభ ఉప ఎన్నికలోనూ ఇవే ఫలితాలు వస్తాయనే ధీమాతో వైసీపీ నాయకులున్నారు.
తిరుపతి కార్పోరేషన్ లోనే కాకుండా సూళ్లూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి మున్సిపాలిటీల్లో వైసీపీ జెండా ఎగిరింది. ఇటీవల ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతుదారులే ఎక్కువగా గెలిచారు. తాజా ఫలితాల నేపథ్యంలో వైసీపీ తిరుపతి లోకసభ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు.
తిరుపతి కార్పోరేషన్ పరిధిలోని 22 డివిజన్లలో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలు జరిగిన 27 డివిజన్లలో వైసీపీకి 47,745 ఓట్లు వచ్చాయి. టీడీపీకి 18,712 ఓట్లు వచ్చాయి. బిజెపికి 3,546 ఓట్లు, జనసేనకు 231, సీపిఎంకు 1,338, సిపిఐకి 619 ఓట్లు పోలయ్యాయి.
సూళ్లూరుపేట మున్సిపాలిటీలో 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపికి 6 వేల ఓట్లు రాగా, టీడీపీకి 2,380 ఓట్లు బిజెపికి 874 ఓట్లు వచ్చాయి.
నాయుడుపేట మున్సిపాలిటీలో 22 వార్డులను వైసీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. మూడు వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 1,735 ఓట్లు రాగా, టీడీపీకి 178, కాంగ్రెసుకు 345 ఓట్లు వచ్చాయి.
వెంకటగిరి మున్సిపాలిటీలో ముగ్గురు వైసీపీ అభ్యర్థులు ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. 22 వార్డులకు ఎన్నికలు జరిగాయి. వైసీపికి 16,883 ఓట్లు రాగా టీడీపీకి 8,369 ఓట్లు వచ్చాయి. బిజెపికి 41, జనసేనకు 202, సిపిఐకి 43 ఓట్లు వచ్చాయి. శ్రీకాళహస్తి, గూడురు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగలేదు.