రోజా సభలోకి అడుగుపెట్టే సమయానికి స్పీకర్, సిఎంపై చేసిన వ్యాఖ్యలు వేరు, తనపై చేసిన వ్యాఖ్యలు వేరని అనిత కొత్త వాదన వినిపిస్తుండటమే విచిత్రంగా ఉంది. 

కొత్త అసెంబ్లీ భవనంలో మొదలయ్యే సమావేశాలకు వైసీపీ ఎంఎల్ఏ రోజా హాజరవుతారా? అధికార టిడిపి రోజాను అడుగుపెట్టనిస్తుందా? లేక ఇంకేవైనా అడ్డంకులు సృష్టిస్తుందా? ఈ ప్రశ్నలపై రాజకీయ పార్టీల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. 2015 డిసెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో అనుచిత వ్యాఖ్యలు చేసారంటూ స్పీకర్ రోజాను ఏడాదిపాటు సస్పెండ్ చేసారు. నిజానికి ఏడాది సస్పెండ్ అన్నది నిబంధనలకు విరుద్ధం. సమావేశాల్లో ఎవరినైనా సభ్యుడిపై చర్యలు తీసుకోవాలంటే కేవలం ఆ సమావేశాలు జరిగే కాలం వరకే చర్యలు తీసుకోవాలి.

పోయిన ఏడాది డిసెంబర్ కు ఏడాది సస్పెన్షన్ కాలం పూర్తయిపోయింది. రోజా వ్యవహారం మీదనే నియమించిన ఎథిక్స్ కమిటి విచారణకు రోజా పలుమార్లు హాజరయ్యారు. తన వ్యాఖ్యల పట్ల విచారం వెలిబుచ్చేందుకు సిద్ధమంటూ కమిటికి రోజా ఓ లేఖ కూడా ఇచ్చారు. అయితే, పోయిన డిసెంబర్ నుండి ఇప్పటి వరకూ సమావేశాలు జరగలేదు. కాబట్టి రోజా లేఖపై సభలో చర్చ జరగలేదు. బడ్జెట్ సమావేశాలు గురువారం నుండి మొదలవుతున్నాయి. ఈ నేపధ్యంలో సభలోకి రోజా అడుగు పెట్టే విషయం సస్పెన్స్ గా మారింది

ఏడాది సస్పెన్షన్ పూర్తయిపోయింది కాబట్టి బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు రోజాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ నిబంధనలకు ఆచరణకు చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే, రోజాను మరో రెండేళ్ళ పాటు సస్పెండ్ చేయాలంటూ పాయకరావుపేట ఎంఎల్ఏ అనిత తాజాగా డిమాండ్ మొదలుపెట్టారు. అనిత డిమాండ్ ను బట్టి రోజా సస్పన్షన్ కు అధికార పార్టీ ఏమైనా కుట్ర చేస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అప్పట్లో రోజా వ్యాఖ్యల వల్ల తనకూ అవమానం జరిగిందని అనిత చెబుతున్నారు. పైగా రోజా వైఖరిలో మార్పు రాకపోగా ఇంకా అహంకారపూరితంగానే వ్యవహరిస్తోందంటూ అనిత ఆరోపణలు గుప్పిస్తుండటం గమనార్హం.

పైగా తనకు బహిరంగ క్షమాపణ చెప్పినంత మాత్రాన సరిపోదని మిగిలిన రెండేళ్ళూ సస్పెండ్ చేయాల్సిందేనంటూ డిమాండ్ చేస్తోంది. స్పీకర్, ముఖ్యమంత్రి, ఎంఎల్ఏ తదితరుల పట్ల రోజా అనుచిత వ్యాఖ్యలు చేసిందనే ఏడాది సస్పెండ్ చేసారు. అయితే, ఇపుడు రోజా సభలోకి అడుగుపెట్టే సమయానికి స్పీకర్, సిఎంపై చేసిన వ్యాఖ్యలు వేరు, తనపై చేసిన వ్యాఖ్యలు వేరని అనిత కొత్త వాదన వినిపిస్తుండటమే విచిత్రంగా ఉంది.