ఢిల్లీపై సేవల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివాదాస్పద బిల్లుకు రాజ్యసభలో మద్దతు ఇస్తామని ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతు ఇవ్వనుంది. అలాగే విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని కూడా వ్యతిరేకిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనుంది.

మణిపూర్ అంశంపై చర్చించాలే ఉద్దేశంతో ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా నిలవడంతో పాటు, ఢిల్లీలో సేవల నియంత్రణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందేందుకు ఏపీ సీఎం జగన్ నేతృత్వంలోని వైసీపీ సహకరించాలని నిర్ణయించింది. ఈ రెండు అంశాలపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేస్తామని వైసీపీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. 

దీంతో రాజ్యసభలో సంఖ్యా బలంలేని ‘ఏన్డీఏ’ వైసీపీ ఎంపీల మద్దతుతో వివాదాస్పద ఢిల్లీ బిల్లుకు సులభంగా ఆమోదం పొందనుంది. బ్యూరోక్రాట్ల బదిలీలు, నియామకాలపై కేంద్రానికి కాకుండా ఢిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికి నియంత్రణ ఉంటుందన్న సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. అయితే ఈ విషయంలో కేంద్రానికే అధికారాలు రావాలని కొంత కాలం కిందట ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. ఆ ఆర్డినెన్స్ ను ఈ వర్షాకాల సమావేశంలో చట్టంగా మార్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో ఆ ఆర్డినెన్స్ స్థానంలో ఇప్పుడు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) బిల్లును తీసుకువచ్చింది. 

కాగా.. రాజ్యసభలో 9 మంది, లోక్ సభలో 22 మంది సభ్యులున్న వైసీపీ పలు కీలక బిల్లులపై తరచూ ‘ఎన్డీఏ’ ప్రభుత్వానికి మద్దతు ఇస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ప్రభుత్వం ప్రతిపాదించిన అభ్యర్థికే అనుకూలంగా ఓటు వేసింది. తాజాగా మణిపూర్ సంక్షోభంపై లోక్ సభలో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆ పార్టీకి చెందిన 22 మంది ఎంపీలు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయనున్నారు. 

ఇదిలా ఉండగా.. ఢిల్లీలోని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతోంది. ఇప్పటికే ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా పర్యటించి పలువురు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి మద్దతు కూడగట్టారు. మొదట్లో ఈ విషయంలో ఆప్ కు కాంగ్రెస్ మద్దతు తెలుపలేదు. కానీ చివరి విపక్షాల సమావేశానికి ముందు కేంద్రం తీసుకొచ్చిన బిల్లును వ్యతిరేకిస్తామని ప్రకటించింది. 

ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్ లలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ.. ప్రతిపక్షాల కూటమిలో ఆప్ చేరడంతో గత వారం ఈ నిర్ణయం తీసుకుంది. కానీ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభలో కూడా కేంద్ర ప్రభుత్వానికి బలం చేకూరింది. రాజ్యసభలో ప్రస్తుతం 238 మంది సభ్యులు ఉండగా మెజారిటీ మార్కు 120కి చేరింది. అయితే అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ)లో బీజేపీ, మిత్రపక్షాలకు 105 మంది సభ్యులు ఉన్నారు. ఐదుగురు నామినేటెడ్, ఇద్దరు ఇండిపెండెంట్ ఎంపీల మద్దతుపై అధికార పార్టీ ధీమాగా ఉంది. ఢిల్లీ ఆర్డినెన్స్ ను 105 మంది సభ్యులు వ్యతిరేకిస్తున్నారు.