చంద్రబాబునాయుడు త్వరలో ఎన్డీఏలో నుండి కూడా బయటకు వచ్చేస్తారా? ఇదే అంశంపై చర్చించేందుకు శుక్రవారం పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహిస్తున్నారు. చంద్రబాబు తీసుకోబోయే నిర్ణయం ఎలాగున్నా క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు మాత్రం చాలా హాటు హాటుగా మారిపోతున్నాయి. జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ చంద్రబాబు, లోకేష్ లను లక్ష్యంగా ఆరోపణలు చేయటంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

పవన్ వ్యాఖ్యలపై బుధవారం రాత్రి నుండి మంత్రులు, ప్రజాప్రతినిధులు మండిపడటం మొదలుపెట్టారు. ఎంతవరకూ నిజమో తెలీదుకానీ పవన్ వ్యాఖ్యల వెనుక బిజెపి హస్తముందని మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు బాహాటంగానే ఎదురుదాడి చేసేస్తున్నారు. బిజెపి శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజే వెనుకుండి పవన్ తో ఇదంతా చేయిస్తున్నారని టిడిపి అంటోంది. ఎవరి వెనుక ఎవరున్నారన్న విషయాన్ని పక్కనపెడితే పవన్ చేసిన ఆరోపణలతొ చంద్రబాబుకు మాత్రం బాగా డ్యామేజి అయ్యిందన్నది వాస్తవం.

ఇక, ప్రస్తుత విషయానికి వస్తే, రాష్ట్రంలోని ప్రతిపక్షాల వెనుక అంటే వైసిపి వెనుక కూడా బిజెపినే ఉందని టిడిపి అనుమానిస్తోంది. అందుకే చంద్రబాబు పదే పదే వైసిపి ఎంపి విజయసాయిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు. బిజెపి వరస చూస్తుంటే ‘ఎన్డీఏలో నుండి టిడిపిని పొమ్మనకుండానే పొగబెడుతోందా’ అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు టిడిపి నేతలు.

రాష్ట్ర ప్రయోజనాల పేరుతో ముందుగా కేంద్రమంత్రులతో రాజీనామాలు చేయించారు. అప్పుడు కూడా మంత్రివర్గం నుండి టిడిపి పోతే పోయిందిలే అన్నట్లుగానే ప్రధానమంత్రి వ్యవహరించారు. దాంతో చంద్రబాబుకు ఒళ్ళు మండింది. ఒకవైపేమో కేంద్ర స్ధాయిలో పూర్తి నిర్లక్ష్యం. రాష్ట్రంలో ఏమో ఒకవైపు వైసిపి ఇంకోవైను బిజెపి నేతలు వాయించేస్తున్నారు. దాంతో చంద్రబాబు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. మరోవైపేమో ఎన్నికలు ముంచుకు వచ్చేస్తున్నాయ్.

ఈ నేపధ్యంలోనే రేపటి ఎన్నికల్లో ఓట్ల కోసం జనాల దగ్గరకు వెళ్ళాలంటే నాలుగేళ్ళ వైఫల్యాన్ని కేంద్రంపైకి నెట్టేయటం ఒకటే మార్గమని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఎన్డీఏలో నుండి కూడా వచ్చేస్తారంటూ టిడిపి నేతలు చెబుతున్నారు. అయితే, ఓటుకునోటు కేసొకటి చంద్రబాబు మెడపై కత్తిలాగ వేలాడుతోంది. దాంతో ఏం చేయాలో అర్దంకాక అవస్తలు పడుతున్నారు. మరి, శుక్రవారం జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలలి.