జనసేన వీరమహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ చీఫ్ జనసేన కీలక వ్యాఖ్యలు చేశారు. భావి తరాల కోసం పార్టీ చేసే అవకాశం జనసేనకు 2014లో వచ్చిందని వివరించారు. సమాజ క్షేమమే మన క్షేమమని ముందు కెళతానని చెప్పిన పవన్ కళ్యాణ్.. సినిమాల్లో చేసే దాంట్లో ఎంతో కొంత చేసినా సంతృప్తేనని అన్నారు. 

అమరావతి: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సంచలన విషయాలు చెప్పారు. ఆయన ఈ రోజు వీర మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా జన సేన ఆవిర్భావం గురించి చెప్పారు. తాను రాబోయే తరాల కోసం పార్టీని స్థాపించానని పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్ఎష్‌లకు అలాంటి అవకాశం వచ్చిందని, ఆ తర్వాత జనసేనకు వచ్చిందని వివరించారు. 2014లో జనసేనకు ఆ అవకాశం వచ్చిందని, జనసేన ఏడు సిద్ధాంతాలతో కచ్చితత్వంతో పని చేస్తుందని అన్నారు. టీఆర్ఎస్ కూడా ఓ సిద్ధాంతం వచ్చినా.. ఇప్పుడు దాని ప్రాధాన్యం మారిందని పేర్కొన్నారు. కులాలను విడగొట్టడం కాదు.. కలిపే ఆలోచన చేయాలని అన్నారు. మత ప్రస్తావన లేని రాజకీయం రావాలని కోరారు. భాష, యాసలను గౌరవించాలని, లేకపోతే రాష్ట్రం విచ్ఛిన్నం అయ్యే ముప్పు ఉంటుందని వివరించారు. అలాగే, నా రాష్ట్రం, నా ప్రాంతం అని అంటిపెట్టుకుని ఉంటే జాతీయవాదానికి దూరం అవుతామని తెలిపారు.

నేను ఒక్కడినే కాదు.. అందరం ఎదగాలి అని తాను నమ్ముతానని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ క్షేమమే.. మన క్షేమం అని ముందుకు వెళతానని తెలిపారు. అదే సందర్భంలో తాను సినిమాలో చేసే వాటిలో ఎంతో కొంత నిజ జీవితంలో చేయగలిగితే అది తనకు చాలా సంతృప్తిగా ఉంటుందని అన్నారు.

అలాగే.. రాజ్యాంగం గురించి కూడా కీలక విషయాలు మాట్లాడారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా రాజ్యాంగానికి తలవంచాల్సిందేనని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజ్యాంగం ప్రకారం నడిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. కాబట్టి, అలాంటి భారత రాజ్యాంగంపై అందరూ అవగాహన పెంచుకోవాలని వివరించారు. అంతేకాదు, సగటు మహిళకు అర్థం అయ్యే సులభ భాషలో రాజ్యాంగంలో కీలక అంశాలతో పుస్తకాన్ని అందిస్తామని చెప్పారు.

జనసేన వీర మహిళలతో ఆయన మాట్లాడుతూ, మగవాళ్లు ఎంత మంది ఉన్నా.. స్త్రీ శక్తి వేరు అని పవన్ కళ్యాణ్ అన్నారు. మహిళా లోకం తలుచుకుంటే ఏదైనా సాధించగలరని, వారిలో అంత శక్తి ఉంటుందని అన్నారు. సమాజాన్ని మార్చేసే శక్తి మహిళల్లో ఉందని వివరించారు. మీ వంటి వీర వనితలే తమకు భారత మాతలు అని అన్నారు. మహిళల్లో చైతన్యం వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని చెప్పారు. జనసేన శిక్షణ తరగతుల ఫలితం ఇప్పుడే కనిపించకపోయినా.. భావి తరాలకు మేలు జరుగుతుందని అన్నారు. ఇవి అద్భుతాలకు అడుగులు వేస్తాయని చెప్పారు. 

అదే సందర్బంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే క్రిమినల్స్‌కు తోడుగా ఉంటారా? ఇలాంటి అరాచకవాదులకు అండగా ఉండాలని గెలిపించలేదని పేర్కొన్నారు. సుగాలి ప్రీతి విషయం తనను కలచి వేసిందని అన్నారు. ఒక ఆడ బిడ్డ మాన మర్యాదలకు భంగం కలిగితే తల్లి పెంపకాన్ని నిందిస్తారా? అంటూ జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆడ పిల్లలకు రోడ్ల మీదకు వెళ్లద్దు అంటారా? 151 మందిని గెలిపించి ఇచ్చింది ఎందుకు? అని ప్రశ్నించారు.

ఇదిలా ఉండగా ప్రజలు అవినీతిని పెద్ద సమస్యగా చూడట్లేదని, పాలకుల దోపిడీని ఎండగట్టాలని సూచించారు. బూతులు తిట్టే మంతులకు భయపడబోమని, దొంగల లెక్కలు బయటపెడితే వారే భయపడతారని అన్నారు. జనసేనలో ధైర్యాన్ని పెంచేలా శిక్షణ ఇస్తుందని తెలిపారు. మద్యం రద్దు అన్నవారే ఇప్పుడు ఏరులై పారిస్తున్నారని, రాజకీయ క్రీడలకు రాష్ట్రాన్ని బలి చేయవద్దని పాలకులపై విరుచుకుపడ్డారు.

ప్రజా సమస్యలు వినే తీరిక సీఎంకు లేదని, తాను రేపు జరిగే జనవాణిలో సమస్యలపై అర్జీలు స్వీకరిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎం నివాసానికి సమీపంలోని ఓ ఇంటిని కూలగొడితే తనను ఆ అమ్మాయి తనను కలిశారని వివరించారు. ఇందుకు ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టారని, వాళ్ల అన్నయ్య అనుమానాస్పద స్థితిలో మరణించాడని ఆరోపించారు. ప్రజలకు సమస్యలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? అందుకే జనసేన జనవాణి చేపడుతున్నదని వివరించారు.