విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగలనుందా..? ఆ పార్టీకి చెందిన ఎంపీ గుడ్ బై చెప్పబోతున్నారా..? ఓ మంత్రితో ఉన్న విబేధాలే ఆయన్ను పార్టీ వదిలేలా చేస్తుందా లేక మంత్రి అసెంబ్లీకి పోటీ చెయ్యాలన్న తన కోరికను పార్టీ పట్టించుకోకపోవడంతో పక్కదారి పట్టారా..?  అంటే అవుననే సమాధానం వస్తుంది. ఆ ఎంపీ పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం పార్టీ మారే ప్రసక్తే లేదంటున్నారు. 

ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఈ పేరు పెట్టి పిలిస్తే అంతగా తెలియరు కానీ అవంతి శ్రీనివాస్ అంటే అందరికి తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో అవంతి విద్యాసంస్థల అధినేతగా ఆయనకు మంచి పేరు ఉంది. అయితే అవంతి శ్రీనివాస్ పార్టీ మారతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. 

త్వరలోనే అవంతి శ్రీనివాస్ టీడీపీని వీడతారని వైసీపీలోకి చేరతారంటూ ప్రచారం జోరుగా జరుగుతుంది. అంతేకాదు డేట్ కూడా కన్ఫమ్ చేసేశారు. డిసెంబర్ 21న అవంతి వైసీపీలో చేరబోతున్నట్లు ఊహాగానాలు ఇప్పుడు ఉత్తరాంధ్రలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లోనే హాట్ టాపిక్ గా మారాయి.   
 
అయితే పార్టీ మారే విషయంపై ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పందించారు. తాను వైసీపీలో చేరబోతున్నట్లు దుష్ప్రచారం జరుగుతోందని అది తప్పుడు ప్రచారం అంటూ కొట్టి పారేశారు. ఈ ప్రచారం వెనుక కేంద్రం కుట్ర దాగి ఉందంటూ ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలు ఉండటంతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలను పార్టీ కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు నమ్మొద్దని సూచించారు. 

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు అవంతి శ్రీనివాస్. టీడీపీ ఎంపీగా తాను పార్లమెంట్‌లో విభజన హామీల అమలు కోసం పోరాడానని గుర్తు చేశారు. ఆ హామీలపై ఇప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై పోరాటాన్ని కొనసాగిస్తానని తెలిపారు. 

మరోవైపు అవంతి శ్రీనివాసరావు పార్టీ మారతారంటూ వస్తున్న ఊహాగానాలను మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఖండించారు. అవంతి ఎట్టిపరిస్థితుల్లో పార్టీ మారరని అదంతా మీడియా సృష్టేనని కొట్టిపారేశారు.

అవంతి శ్రీనివాస్ పార్టీ వీడతారంటూ ప్రచారం రావడం ఇదే మెదటిసారి కాదు. ఈ ఏడాది జూన్ నెలలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ ఏడాది జూన్‌లోనే టీడీపీ వీడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆ ప్రచారం కాస్త సద్దుమణిగింది.  

మళ్లీ తాజాగా ఆయన పార్టీ మారుతున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. 

అవంతి శ్రీనివాస్ 2004లో రాజకీయ ఆరంగేట్రం చేశారు. ఆనాడు ప్రజారాజ్యం పార్టీ తరపున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత పీఆర్పీని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడంతో ఆయన కాంగ్రెస్ లోనూ కొనసాగారు. 

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మంత్రి గంటా శ్రీనివాస్ తో కలిసి టీడీపీలో చేరిపోయారు. అయితే 2014 ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు పోటీ చేసి మంత్రిగా పనిచేస్తున్నారు. అయితే అవంతి శ్రీనివాసరావు అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 

అయితే 2019 ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. ఈ విషయాన్నిచంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగా ఎలాంటి హామీ రాలేదు. అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకర్గం నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నా గంటా శ్రీనివాసరావు మాత్రం మళ్లీ భీమిలి నుంచే పోటీ చెయ్యాలని భావిస్తున్నారు. 

అయితే కొద్ది రోజుల క్రితం గంటా శ్రీనివాసరావుకు భీమిలి నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితి నెలకొందని ఆయన వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తల నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు అలిగారు. 

పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. గంటా అలకతో దిగివచ్చిన టీడీపీ అధిష్టానం భీమిలి నియోజకవర్గం నుంచే గంటా పోటీ చేస్తారంటూ హామీ ఇవ్వడంతో దిగొచ్చారు. తనకు భీమిలి నియోజకవర్గం టిక్కెట్ కన్ఫమ్ కావడంతో ఆయన ఎన్నికలకు రెడీ అవుతున్నారు.   

తాను ఎలాగైనా మళ్లీ భీమిలి నియోజకవర్గం నుంచే పోటీ చెయ్యాలని అవంతి శ్రీనివాసరావు కూడా భావిస్తున్నారు. తాను ఎట్టిపరిస్థితుల్లో అక్కడ నుంచే పోటీ చెయ్యాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. అయితే తనకు టీడీపీ నుంచి టిక్కెట్ వచ్చే అవకాశం లేదని తేటతెల్లమవ్వడంతో ఆయన వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం. అవంతి శ్రీనివాస్ పార్టీ మారే విషయంపై క్లారిటీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికైనా ప్రచారం ఆగిపోతుందా లేక కొనసాగుతుందా అన్నది వేచి చూడాలి.