కేసులు, తీర్పులుంటే ప్రమాణ స్వీకారం చేయకూడదని ఎక్కడైనా ఉందా? ఈ రోజు సిఎంగా బాధ్యతలు తీసుకున్న శశికళే రేపటి రోజున తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పుడే రాజీనామా చేయవచ్చు కదా?

‘తమిళనాడులో చోటు చేసుకున్న ప్రస్తుత పరిణమాల్లో కేంద్రం ఎలాంటి జోక్యం చేసుకోదు’.....ఇది తమిళనాడులో నెలకొన్నరాజకీయ అనిశ్చితిపై తాజాగా వెంకయ్యనాయడు చెప్పిన మాటలు. వెంకయ్య మాటలను ఎవరైనా నమ్ముతారా? 130 మంది ఎంఎల్ఏ మద్దతు ప్రకటించినా శశికళను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి గవర్నర్ అనుమతించకపోవటాన్ని ఏమనాలి? రాష్ట్రంలో రాజకీయంగా ప్రకంపనలు తారాస్ధాయికి చేరుకున్న సమయంలో గవర్నర్ పత్తా లేడు. చెన్నైలో నేతలకు అందుబాటులో ఉండాల్సిన గవర్నర్ ముంబాయ్ లో తీరుబడిగా ఉండటమేమిటి?

రాజ్యాంగం ప్రకారం మెజారిటీ ఎంఎల్ఏల మద్దతు ఎవరికి ఉంటే వారే ముఖ్యమంత్రి. పైగా పోయిన ఆదివారమే ఎంఎల్ఏలంతా కలిసి శశికళను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా కూడా ఎన్నుకున్నారు. అంటే సిఎం అవ్వటానికి శశికళకు ఎటువంటి అడ్డంకులు లేనట్లే. పార్టీ మొత్తం మద్దతు ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేయించటానికి గవర్నర్ కు వచ్చిన అభ్యంతరం ఏమిటి?

శశికళపై ఉన్న కేసులకు సంబంధించి వారంరోజుల్లో తీర్పు వస్తుందట. అది చూసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారంపై నిర్ణయం తీసుకోవచ్చని గవర్నర్ శశికళకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. భాజపా ఎవరి చెవిలో పూలు పెడుతున్నట్లో. కేసులు, తీర్పులుంటే ప్రమాణ స్వీకారం చేయకూడదని ఎక్కడైనా ఉందా? ఈ రోజు సిఎంగా బాధ్యతలు తీసుకున్న శశికళే రేపటి రోజున తీర్పు వ్యతిరేకంగా వస్తే అప్పుడే రాజీనామా చేయవచ్చు కదా? ఎప్పుడో తీర్పు వస్తుందని ఇపుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవద్దని గవర్నర్ సూచించటంలో కుట్ర కోణమే కనిపిస్తోంది.

ఇప్పటి వరకూ తమిళనాడులో కాలు కాదు కదా కనీసం వేలు పెట్టటానికి కూడా భాజపాకు అవకాశం రాలేదు. హటాత్తుగా జయలలిత మరణించారు. దాంతో రాష్ట్రంలో బలపడాలని భాజపా అనుకుంటున్నట్లుంది. దానికితోడు అధికార పార్టీలో మొదలైన అనిశ్చితి బాగా కలిసి వచ్చిందని భాజపా అనుకుంటోంది. అందుకనే గవర్నర్ ను అడ్డుపెట్టుకుని నరేంద్రమోడి నాటకాలు ఆడిస్తున్నారు. ఈ విషయాలేవీ జనాలకు అర్ధం కావని బహుశా వెంకయ్యనాయుడు అనుకుంటున్నారేమో. జనాలు వెంకయ్యకన్నా తెలివిమీరిపోయారు. ఆ విషయాన్ని వెంకయ్య గ్రహిస్తే మంచిది.