భర్త ఉద్యోగం చేసి సంపాదించాలని చాలా మంది భార్యలు కోరుకుంటారు. ఈమె మాత్రం అందుకు భిన్నం. భర్త చేస్తున్న ఉద్యోగాన్ని ఆమె కొట్టేయాలనుకుంది. అందుకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని ప్లాన్ వేసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... అనంతపురం నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో నిషారుద్దీన్ అనే వ్యక్తి జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. అతని పెళ్లై భార్య ఉంది. కానీ... ఇద్దరి మధ్య కలహాల కారణంగా నాలుగు సంవత్సరాల క్రితం విడిపోయారు. భర్తకు దూరంగా ఉంటున్నప్పటికీ... డబ్బు మీద మాత్రం అతని భార్యకు ఆవచావలేదు.

దీంతో... భర్తను హత్య చేస్తే అతని ఉద్యోగంతోపాటు.. రూ.14లక్షల బీమా డబ్బు వస్తుందని  ఆమె ఆశపడింది. అందుకోసం ఓ పథకం వేసింది. తనకు తెలిసిన జిల్లా మహిళా మండలి అధ్యక్షురాలు నిర్మలాదేవిని సంప్రదించింది.  ఆమె సహాయంతో... భర్తను హత్య చేసేందుకు ఓ ముఠాను మాట్లాడింది. రూ.5లక్షల నగదు ఇస్తానని హామీ ఇచ్చి భర్తను హత్య  చేయాలని పురమాయించింది.

నిషారుద్దీన్ ని తాడిపత్రి బస్టాండ్ లో చంపేందుకు వారు ప్లాన్ వేయగా... అది బెడసి కొట్టి పోలీసులకు దొరికిపోయారు. అదే సమయంలో అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న పోలీసులు అనుమానంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు పాత నేరస్థులు కావడంతో పోలీసులు వారిని అనుమానించారు. వాళ్లను అదుపులోకి తీసుకోవడంతో హత్య పథకం బయటపడింది. హత్య కు పథకం వేసినవారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.