బిజెపి నేతపై హత్యాయత్నం: ప్రియుడితో కలిసి భార్య ప్లాన్

Wife planned to kill BJP leader
Highlights

బిజెపి నాయకుడు, వ్యాపారి కారె అప్పలరాజుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన హత్యాయత్నంలో భార్యనే కీలక సూత్రధారి అని తేలింది.

విశాఖపట్నం: బిజెపి నాయకుడు, వ్యాపారి కారె అప్పలరాజుపై శుక్రవారం అర్థరాత్రి జరిగిన హత్యాయత్నంలో భార్యనే కీలక సూత్రధారి అని తేలింది. విశాఖ ఏజెన్సీ సీలేరులో అప్పలరాజుపై హత్యాయత్నం జరిగింది. అప్పలరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి కేసు మిస్టరీని ఛేదించారు.

అప్పలరాజును హత్య చేయించేందుకు భార్యే కుట్ర పన్నిందని తమ దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు జీకేవీధి సీఐ నారాయణరావు, సీలేరు ఎస్సై విభూషణరావు మంగళవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. 

వారు అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం వేమవరం గ్రామానికి చెందిన నేమాల శ్రీనివాస్‌ (చిన్నా)కు అప్పలరాజు భార్య మహేశ్వరికి వివాహేతర సంబంధం ఉంది. దీంతో భార్యను అప్పలరాజు వేధించేవాడు. 

ఈ విషయాన్ని ఆమె శ్రీనివాస్‌కు ఎన్నోసార్లు చెప్పడంతో అతడిని అడ్డుతొలగించేందుకు ఇద్దరు ఈ నెల 1వ తేదీన కుట్రపన్నారు. అప్పలరాజును హత్యచేయించేందుకు తన దగ్గర జేసీబీ ఆపరేటర్లుగా పనిచేస్తున్న విశాఖ జిల్లా కోటవురట్ల మండలం లింగాపురం గ్రామానికి చెందిన కొరుప్రోలు ప్రసాద్‌ (25), సర్వసిద్ధి దుర్గ (22)లను  శ్రీనివాస్‌ ఒప్పించాడు. 

పథకం ప్రకారం వారు ఈ నెల 1వ తేదీ ఉదయం 11 గంటలకు సీలేరు చేరుకున్నారు. సాయంత్రం వరకు రెక్కీ నిర్వహించారు. అదే రోజు రాత్రి భోజనంలో అప్పలరాజుకు భార్య మహేశ్వరితో నిద్రమాత్రలు కలిపి పెట్టించారు. అర్ధరాత్రి వరకు ఇంటి గోడ వద్ద వేచి ఉన్నారు. మహేశ్వరి గేటు తాళం తీసి ఉంచింది. 
ఇంట్లో కుక్కను వెనుకవైపు కట్టింది. చుట్టుపక్కల వారు నిద్రించారని తెలుసుకున్న తర్వాత వారిరువురు ఇంట్లోకి ప్రవేశించారు. దుకాణంలో నిద్రిస్తున్న అప్పలరాజు కాళ్లను ఒకరు పట్టుకుని వృషణాలు నొక్కేందుకు ప్రయత్నించారు. మరో వ్యక్తి మెడకు చీర బిగించి చంపేందుకు ప్రయత్నించాడు.

అప్పలరాజు కేకలు వేయడంతో కాళ్లు పట్టుకున్న వ్యక్తి పరారయ్యాడు. ప్రసాద్‌తో అప్పలరాజు పెనుగులాడుతూ కేకలు వేశాడు. చుట్టుపక్కల వారు రావడంతో అతను సైతం పారిపోయాడు. అయితే, వారు టీషర్ట్, చెప్పులు, హత్యాయత్నానికి ఉపయోగించేందుకు తెచ్చిన సిరంజి వదిలి వెళ్లిపోయారని పోలీసులు తెలిపారు. 

రంగంలోకి దిగిన పోలీసులు ప్రసాద్, దుర్గ వదిలి వెళ్లిన దుస్తులు, పరిసరాల్లోని వ్యక్తుల సమాచారం ఆధారంగా గాలింపు చేపట్టారు. సీలేరు సమీపంలోని మైదాన ప్రాంతాల్లోకి పారిపోతుండగా దుర్గ, ప్రసాద్‌లను అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో వారు అసలు విషయం చెప్పారు. 

ఈ కేసులో శ్రీనివాస్‌ పరారీలో ఉండగా, భార్య మహేశ్వరి, ప్రసాద్, దుర్గలను మంగళవారం అరెస్టు చేసి కోర్టుకు తరలిచారు.

loader