కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో దారుణమైన హత్య జరిగింది. మద్యానికి బానిస అయిన తన భర్తను ఓ మహిళ సుపారీ గ్యాంగ్ తో చంపించింది. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చిన్న గుమ్మడాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 

శివపురానికి చెందిన కైప గంగయ్య (35) పదేళ్ల క్రితం దరగమ్మ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. అయితే, అతను మద్యానికి బానిసయ్యాడు. ఎంతగా చెప్పినా అతను మారకపోవడంతో ఆమె భర్తను చంపించింది.

భర్త హత్యకు ఆమె రూ.3 లక్షలకు ఒప్పందం చేసుకుంది. లక్ష రూపాయలు అడ్వాన్స్ గా చెల్లించింది. సోమవారం రాత్రి గంగయ్యతో మాట కలిపి సుపారీ గ్యాంగ్ గంగయ్యను బయటకు తీసుకుని వెళ్లారు. అతనితో విపరీతంగా మద్యం తాగించారు. 

ఆ తర్వాత కర్రలతో కొట్టి అతన్ని చంపేశారు మృతదేహాన్ని నల్లమల అటవీ ప్రాంతంలో పడేశారు. దరగమ్మపై అనుమానం రావడంతో పోలీసులు విచారించారు. దీంతో ఆమె అసలు విషయం బయటపెట్టింది.