విశాఖపట్నం: పిల్లలపై ప్రేమతో ఓ తల్లి తన పసుపుకుంకుమలను వదులుకోడానికి సిద్దపడింది. కడుపు తీపి ముందు కట్టుకున్నవాడిపై ప్రేమ ఏమాత్రం సరితూగలేదు. భర్త ఎక్కడ కన్నబిడ్డలకు అపకారం తలపెడతాడోనన్న అనుమానంతో కట్టుకున్నవాడినే హతమార్చింది ఓ మహిళ. ఈ దారుణం విశాఖలో చోటుచేసుకుంది. 

వివరాల్లోకి వెళితే... విశాఖలోని ఏవీఎన్‌ కాలేజీ ద్వారం వీధిలో పుండరీకాక్షయ్య-పుణ్యవతి దంపతులు పిల్లలతో కలిసి నివాసముండేవారు. అయితే భర్త కన్నబిడ్డల పట్ల కర్కశంగా ప్రవర్తించేవాడు. దీంతో అతడు ఎక్కడ పిల్లలను చంపేస్తాడో అన్న అనుమానం పుణ్యవతికి కలిగింది. ఇలా భర్త ఏదయినా అఘాయిత్యానికి పాల్పడడానికి ముందే అతడిని హతమార్చాలని ఆమె నిర్ణయించుకుంది. 

శుక్రవారం తెల్లవారుజామున నిద్రలో వున్న భర్తను రోకలిబండతో అతి దారుణంగా కొట్టి చంపింది. రక్తపు మడుగులో పడివున్న పుండరీకాక్షయ్య మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. భర్తను తానే హత్యచేసినట్లు పుణ్యవతి ఒప్పుకోవడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.