విశాఖపట్నం: అతడికి అప్పటికే మూడు పెళ్లిలయ్యాయి. అయినా నాలుగో పెళ్లికి సిద్దపడి విడాకులు కావాలంటూ మూడో భార్యకు చిత్రహింసలు పెట్టడం ప్రారంభించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. 

వివరాల్లోకి వెళితే... విశాఖ డాక్ యార్డ్ లో పనిచేసే వాసంశెట్టి విష్ణుపోతనకు రెండు పెళ్లిల్లు చేసుకున్నా సంతానం కలుగకపోవడంతో లక్ష్మీసరోజ ను మూడో పెళ్లి చేసుకున్నాడు. అయినప్పటికీ సంతానం కలుగకపోవడంతో ఓ పిల్లాడిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. 

అయితే విష్ణుపోతన ఇటీవల నాలుగో పెళ్లిన సిద్దపడి మూడో భార్యను చిత్రహింసలకు గురిచేయడం ప్రారంభించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో నాలుగో పెళ్లి ఏర్పాట్లను ముమ్మరం చేసిన అతడు మ్యాట్రిమోని సైట్లను సంప్రదించాడు. అంతేకాకుండా విడాకులు ఇవ్వాలంటూ పుట్టింటికి వెళ్లిమరీ భార్యను వేధించసాగాడు. 

భర్త చేష్టలతో విసిగిపోయిన సరోజ పోలీసులను ఆశ్రయించింది. మరో పెళ్లి కోసం తనను వదిలించుకోవాలని చూస్తూ వేధిస్తున్న భర్తపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సదరు శాడిస్ట్ భర్తపై కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నరు.