కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. భర్త హత్య కేసును పోలీసులు విచారిస్తుండగానే భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దాంతో పిల్లలు దిక్కులోనివారయ్యారు. 

పిఠాపురంలోని శ్రీపాద వల్లభన మహా సంస్థానం ఎదురుగా ఉ్న వీధిలో ఈ నెల 8వ తేదీన రెడ్డెం శ్రీనివాస్ (48) హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులు మంచానికి కట్టేసి తలపై బలంగా మోది చంపేశారు. దానిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

ఈ స్థితిలో శుక్రవారం మధ్యాహ్నం నీరసంగా ఉందని చెప్పి  శ్రీనివాస్ భార్య స్వరూపారాణి (30) గదిలోకి వెళ్లింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఫ్యానుకు ఉరేసుకుని మరణించింది. కుటుంబ సభ్యులు గుర్తించి కిందికి దింపి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకరలం సృష్టించింది.

మొదటి భార్య మరణించడంతో శ్రీనివాస్ ఏడేళ్ల క్రితం స్వరూపారాణిని పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే ఆయనకు కృష్ణవంశి, గీతిక అనే ఇద్దరు పిల్లలున్నారు. స్వరూపారాణికి ఓ కుమారుడు వరుణ్ సంతోష్ పుట్టాడు. శ్రీనివా్స తండ్రి సత్తిరాజుతో పాటు భార్య ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటూ వ్యవసాయం చేసుకునేవాడు.