ఒంగోలు: ప్రేమించి పెళ్లి చేసుకొన్న  మూడేళ్ల తర్వాత భార్యాభర్తలు మరణించారు. భర్త హత్యకు గురి కాగా, భార్యఆత్మహత్య చేసుకొంది.ఈ  ఘటన  ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటు చేసుకొంది.ప్రకాశం జిల్లా  ఒంగోలుకు చెందిన  కబాలి నాగరాజు కు 26 ఏళ్లు. ఆయన ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.  మద్దిపాడు మండలం  ఏడుగుండ్లపాడుకు చెందిన శ్రీవల్లి వయస్సు 21 ఏళ్లు. ఆమె ఓ బట్టల దుకాణంలో పనిచేసేది.  వీరిద్దరూ ప్రేమించుకొన్నారు.

మూడేళ్ల క్రితం  వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. ఒంగోలు హిల్ కాలనీలో  ఇల్లు అద్దెకు తీసుకొని  జీవనం సాగిస్తున్నారు.  ఇటీవల కాలంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమూ శ్రీవల్లి నాగరాజుపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.  దీంతో నాగరాజు తాను అద్దెకు ఉన్న ఇంటికి సమీపంలోనే ఉన్న తన స్వంత ఇంట్లో ఉంటున్నాడు. శ్రీవల్లి మాత్రం అదే ఇంట్లో ఉంటుంది.

బుధవారం నాడు ఉదయం టంగుటూరు మండలం మర్లపాడు దగ్గర చెరువులో ఓ మృతదేహం లభ్యమైంది.  తల వెనుక భాగంలో గొంతుపై గాయాలున్నాయి.  మృతుడి దగ్గర లభ్యమైన  ఫోన్ ఆధారంగా మృతుడు నాగరాజుగా పోలీసులు గుర్తించారు.ఈ మేరకు మృతుడి భార్య శ్రీవల్లికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ హత్య కేసు విషయమై  శ్రీవల్లిని ప్రశ్నించేందుకు పోలీసులు వచ్చారు. తమతో పోలీస్ స్టేషన్ కు రావాలని కోరారు. అయితే డబ్బులు తీసుకొని వస్తానని చెప్పి శ్రీవల్లి ఇంట్లోకి వెళ్లి  ఎంతసేపటికిరాలేదు.  కుటుంబసభ్యులు గదిలోకి వెళ్లి చూసేసరికి  శ్రీవల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొంది.  

నాగరాజు హత్యతో పాటు శ్రీవల్లి ఆత్మహత్యపై పోలీసులు వేర్వేరు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.