అక్రమ సంబంధం అనుమానంతో నిత్యం వేధిస్తున్న తాగుబోతు భర్తను తల్లి సాయంతో అతి కిరాతకంగా చంపిందో వివాహిత.
బాపట్ల : తాగుబోతు భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ దారుణానికి ఒడిగట్టింది. తల్లి సాయంతో భర్తను కిరాతకంగా చంపిన మహిళ ప్రమాదవశాత్తు మృతిచెందాడని అందరినీ నమ్మించేందుకు కొత్త నాటకానికి తెరతీసింది. కానీ మృతుడి సోదరుడు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు నిజం బయటపడింది. దీంతో తల్లీకూతుళ్లు కటకటాల పాలయ్యారు.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వేటపాలెం మండలం దేశాయిపేట పంచాయితీ అంబేద్కర్ నగర్ లో అజయ్ బాబు-శోభారాణి దంపతులు ఇద్దరు పిల్లలతో కలిసి నివాసముండేవారు. మద్యానికి బానిసైన భర్త నిత్యం తాగుతూ మత్తులో వుండేవాడు. ఈ క్రమంలోనే భార్య శోభారాణి అక్రమ సంబంధాన్ని కలిగివుందని అనుమానాన్ని పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తల మద్య గొడవలు జరుగుతుండేవి.
ఇటీవల కూతురు శోభారాణి ఇంటికి తల్లి నాగమ్మ వచ్చింది. అయితే ఎప్పటిలాగే ఆరోజు కూడా తాగి ఇంటికి వచ్చిన అజయ్ బాబు భార్యతో పాటు ఆమె తల్లితోనూ గొడవపడ్డారు. నిద్రపోయిన తర్వాత కూడా భార్యను చంపుతానని కలవరించడంతో భర్తతో తనకు ప్రాణహాని వుందని శోభారాణి అనుమానించింది. అంతకంటే తానే భర్తను హతమార్చాలని నిర్ణయించుకున్న ఆమె తల్లి సాయాన్ని కోరింది.
Read More బ్లేడ్‌తో కోసుకొని , ఆపై హత్య:చిత్తూరు కొండమిట్ట దుర్గా ప్రశాంతి హత్యలో కీలక విషయాలు
తల్లీ కూతురు ఇద్దరు కలిసి అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో గాఢ నిద్రలో వున్న అజయ్ బాబు తలపై ఇరుపరాడ్డుతో విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తల పగిలి తీవ్ర రక్తస్రావంతో అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అనంతరం బట్టలకు ఉపయోగించే నాడా గొంతుకు బిగించడంతో ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే అతడి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చి ఓ బండరాయిపై పడినట్లుగా పడుకోబెట్టి తమకేమీ తెలియదన్నట్లుగా నాటకమాడారు తల్లీకూతుళ్లు. ఎప్పటిలాగే తాగిన మైకంలో ఇంటికి వచ్చిన భర్త బండరాయిపై పడి చనిపోయినట్లు అందరికీ చెప్పారు.
అయితే మృతుడు అజయ్ బాబు సోదరుడు విజయ్ బాబుకు తల్లీ కూతుళ్ల మాటలపై అనుమానం కలిగి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. వారు శోభారాణి, నాగమ్మను తమదైన పద్దతిలో విచారించగా అసలు నిజాన్ని బయటపెట్టారు. భర్తను ఎలా చంపింది శోభారాణి పోలీసులకు తెలిపింది. దీంతో ఆమెతో పాటు తల్లి నాగమ్మపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు జైలుకు పంపించారు. కన్న తల్లి తండ్రిని చంపి జైలుకెళ్లడంతో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.
