వివాహేతర సంబంధం పెట్టుకుని తనను మానసికంగా హింసిస్తున్న భర్తను చితకబాదిందో భార్య. దీంతో అతను తీవ్ర గాయాలపాలయ్యాడు. 

బెల్లంకొండ : ఆంధ్ర ప్రదేశ్ లోని బెల్లంకొండ గ్రామంలో ఓ ఘటన కలకలం రేపింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తకు.. భార్య దేహశుద్ధి చేసిన ఘటన శుక్రవారం సాయంత్రం వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించి గ్రామస్తులు వివరాలు ఇలా తెలిపారు.. బెల్లంకొండకు చెందిన వైసీపీ గ్రామ అధ్యక్షుడు గుర్రాల షేక్ కరీముల్లా అలియాస్ బడా బాచ్చాకు వివాహమయ్యింది. అయితే మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. 

ఈ నేపథ్యంలోనే భార్యను నిత్యం మానసికంగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. దీంతో ఆమె గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం నాడు భర్త ఇంటికి మరొక బంధువును వెంట తీసుకుని వచ్చింది. అక్కడ భర్తతో మాట్లాడుతున్న క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పట్టరాని ఆగ్రహానికి గురైన ఆ వైసీపీ నేత ఆమెను దుర్భాషలాడాడు. వివాహేతర సంబంధం పెట్టుకొని తనను చిత్రహింసలకు గురి చేస్తూ.. పైగా న్యాయం చేయమంటే తిడుతుండడంతో తీవ్ర కోపానికి గురైన భార్య అతనికి దేహశుద్ధి చేసింది.

దాచేపల్లిలో దారుణం : వ్యక్తిని చంపి, ముక్కలుగా కోసి.. కాల్చేశారు..

ఈ మేరకు విషయం తెలియడంతో ఎస్సై అమీర్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపించాడు. 108 వాహనంలో గాయపడిన ఆ నేతను సత్తెనపల్లి హాస్పిటల్కు పంపించారు. అయితే ఈ ఘటన మీద తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 17న ఇలాంటి ఓ ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ భార్య తన భర్తను ప్రియుడితో కలిసి హతమార్చింది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూరులో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. హత్యకు గురైన వ్యక్తి హోటగళ్లి నివాసి అయిన మంజు(27). మంజుకు లిఖిత అనే మైసూరు బోగాదికి చెందిన మహిళతో 12 ఏళ్ల కిందట పెళ్లయింది. వీరికి ఇద్దరు కొడుకులు. అయితే, లిఖితకి వివాహేతర సంబంధం ఉంది. గతంలో కూడా ఒకసారి ప్రియుడితో కలిసి ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ విషయం పెద్దల పంచాయితీకి వెళ్లేసరికి.. ఆమెను తీసుకువచ్చిన వారు ఇద్దరు మధ్య రాజీ కుదిర్చి.. భర్తకు అప్పగించారు. 

ఆ తర్వాత తరచూ భార్య ప్రవర్తనను భర్త మంజు ప్రశ్నిస్తూ ఉండేవాడు. దీంతో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతుండేవి. రాజీ కుదిర్చి, భర్తతో వచ్చేసిన తర్వాత కూడా లిఖిత ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. దీనికి తోడు భర్త పదేపదే ప్రశ్నిస్తూ ఉండడం ఆమెకు నచ్చలేదు. దీంతో భర్త అడ్డు తొలగించుకోవాలని ప్రియుడుతో కలిసి కుట్ర పన్నింది. దీంట్లో భాగంగా ఈ మంగళవారం రాత్రి లిఖిత ఇంటికి ఆమె ప్రియుడు వచ్చాడు. అప్పటికి గాఢ నిద్రలో ఉన్న మంజును ఇద్దరూ కలిసి గొంతు పిసికి హత్య చేశారు.

ఆ తర్వాత.. లిఖిత కొత్త నాటకానికి తెరతీసింది. భర్త అనారోగ్యంతో హఠాత్తుగా చనిపోయాడు అంటూ శోకాలు పెట్టింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అంతకుముందు ఫ్యామిలీలో గొడవలు ఉండడంతో లిఖిత మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. విజయనగర పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. లిఖితను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను ఈ కేసులో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.