అమరావతి: వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ఉల్లంఘనలపై ఏపీ హైకోర్టు సీరియస్ కామెంట్స్ చేసింది. సీబీఐ దర్యాప్తుకు ఎందుకు ఆదేశించకూడదని ఏజీని ప్రశ్నించింది హైకోర్టు.

వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని దాఖలైన పిటిషన్ ను బుధవారం నాడు ఏపీ హైకోర్టు విచారించింది.

లబ్దిదారులతో ముఖాముఖిలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారని ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులే నిబంధనలు పాటించకపోవడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. 

నిబంధనలు ఉల్లంఘించిన ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వం చర్యలు తీసుకొన్నప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. 

ఈ విషయమై వారం రోజుల్లో హైకోర్టుకు నివేదిక సమర్పిస్తామని అడ్వకేట్ జనరల్ స్పష్టం చేశారు. దీంతో ఈ కేసు విచారణను వారం రోజులకు వాయిదా వేసింది హైకోర్టు.

also read:లాక్ డౌన్ ఉల్లంఘన: రోజా సహా వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్

లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సమావేశాలు నిర్వహిస్తున్నారని అడ్వకేట్ కిషోర్ హైకోర్టులో మే 1 తేదీన పిల్ దాఖలు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ఎమ్మెల్యేలకు కూడ కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన కోరారు.వైసీపీ ఎమ్మెల్యేలు మధుసూధన్ రెడ్డి, రోజా, సంజీవయ్య, వెంకటగౌడ, విడుదల రజనిలను ప్రతివాదులుగా చేర్చారు. 

ఈ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ విచారణ చేసింది. ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘనల విషయంలో పిటిషనర్ తరపు న్యాయవాది కొన్ని వీడియో క్లిప్పింగ్ లను కూడ ఇదివరకే కోర్టుకు సమర్పించారు.

ఎమ్మెల్యేలు రోజా సహా మదుసూదన్ రెడ్డి, విడుదల రజని, సంజీవయ్య, వెంకటగౌడ్ లు లాక్ డౌన్ ఉల్లంఘించారని తొలుత హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. వారికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత మరో ముగ్గురిపై కూడా ఫిర్యాదుచేశారు.