లాక్ డౌన్ ఉల్లంఘన: రోజా సహా వైసీపీ ఎమ్మెల్యేలపై హైకోర్టులో పిటిషన్
వైసీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తున్నారంటూ కిశోర్ అనే న్యాయవాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. రోజా సహా పలువురు ఎమ్మెల్యేలు లాక్ డౌన్ ను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసీపి) ఎమ్మెల్యేలపై హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) నమోదైంది. లాక్‌డౌన్ నిబంధనలకు ఉల్లంఘిస్తూ సమావేశాల్లో పాల్గొంటున్నారంటూ వారిపై కిశోర్ అనే న్యాయవాది పిల్ దాఖలు చేశారు. అధికారపార్టీ నేతలను అడ్దుకోవాలంటూ ఆయన కోరారు.
నిబందలను ఉల్లంఘించిన వైసీపీ నేతలకు కరోనా పరీక్షలు నిర్వహించాలని ఆయన పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. తన పిల్ లో ప్రతివాదులుగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే రోజా, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడ, చిలకలూరిపేట ఎమ్మెల్యే రజనీలను చేర్చారు.
లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితంకావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయంటూ కిశోర్ గుర్తు చేశారు. అయినా కొందరు లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించారని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు యదేచ్ఛగా జనంలో తిరుగుతున్నారని ఆయన విమర్శించారు.
నగరిలో రోజా ప్రజల్లో విస్తృతంగా తిరిగిన విషయం తెలిసిందే. ఆమెపై ప్రజలు పూలవర్షం కూడా కురిపించారు. ఈ సంఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘిస్తున్నారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా విమర్శించారు. ఈ నేపథ్యంలో కిశోర్ అనే లాయర్ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు కనిపిస్తోంది.