AP High Court: తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిలో కొంత మందిని తొలగించాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది.  

AP High Court: ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి (Tirumala Tirupati Devasthanam-TTD) లో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిలో కొంత మందిని తొలగించాల్సిందేనని న్యాయస్థానం పేర్కొంది. వివరాల్లోకెళ్తే.. నేర చరిత్ర కలిగిన వారితో పాటు అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన వారు సైతం కొందరు వ్యక్తులు ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ ఇటీవల హై కోర్టు (AP High Court)లో పిటిషన్ దాఖలైంది. నేరచరిత్ర ఉన్న వారిని తిరుమ తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యులుగా నియమించడంపై హైకోర్టులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి ఈ పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ క్ర‌మంలోనే తాజాగా తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌కమండ‌లి (Tirumala Tirupati Devasthanam-TTD)లో నేర చరితుల్ని స‌భ్యులుగా చేర్చ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. పిటిషనర్ తరఫున‌ లాయర్‌ అశ్వనీకుమార్ వాద‌న‌లు వినిపించారు. కేసు వివరాలను ధర్మాసనానికి అశ్వనీకుమార్‌ వివరించారు. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థాన పాలకమండలిలోని 30 మంది సభ్యుల్లో 18 మందికి నేర చరిత ఉందంటూ న్యాయవాది అశ్విన్ కుమార్ ప్రత్యేక పిటిషన్ లో పేర్కొన్నారు. 18 మంది సభ్యుల నేర చరిత్రపై అశ్విన్ కుమార్ కోర్టు (AP High Court)లో వాదనలు వినిపించారు. 

విచారణ చేపట్టిన హైకోర్టు చీఫ్ జస్టిస్..నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “భగవంతుని సేవలో నేరచరితులా..? ఇలాంటి వాటిని ఉపేక్షించను” అంటూ హైకోర్టు సీజే ప్రభుత్వంపై, టీటీడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకేదో లబ్ధి జరగడం వల్లే ఇలా చేస్తున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. అశ్వనీకుమార్‌ వాదనల్లో ప్రాథమిక సాక్ష్యాలున్నాయని భావిస్తున్నామనీ, కనీసం కొంత మందినైనా తొలగించాల్సిందేనని హైకోర్టు (AP High Court) పేర్కొంది. 

తిరుమల తిరుప‌తి దేవ‌స్థాన పాల‌క (Tirumala Tirupati Devasthanam-TTD) భవనం కలెక్టరేట్‌ అవసరాలకు వాడుకుంటే..విధానపరమైన నిర్ణయం కాబట్టి సమర్థించామని కోర్టు తెలిపింది. కానీ నేరచరిత్ర ఉన్న సభ్యులు టీటీడీ పాలకవర్గంలో ఉండొద్దని సూచించింది. నేరచరితపై ప్రాథ‌మిక ఆధారాలు ఉన్న వారు పాలకమండలి నియమకాలకు అర్హులు కారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ విష‌యంలో ఇక ఎట్టి పరిస్థితుల్లో మినహాయింపులు ఉండబోవని హైకోర్టు స్పష్టం చేసింది. త‌దుప‌రి విచార‌ణ‌ను ఏప్రిల్ 19కి వాయిదా వేసిన న్యాయ‌స్థానం.. వాదనలు విన‌డంతో పాటు అదే రోజు నిర్ణయం కూడ తీసుకుంటామని తెలిపింది.