పవన్ కల్యాణ్: మొదలైన అనుమానాలు

పవన్ కల్యాణ్: మొదలైన అనుమానాలు

జనసేన ఆవిర్భావ దినోత్పవంలో పవన్ కల్యాణ్ ప్రసంగం తర్వాత జనాలకు కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తన వైఖిరికి భిన్నంగా పవన్ కొత్తగా మాట్లాడటంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే, ఇంతకాలం చంద్రబాబునాయుడుకు అనుకూలంగానే పవన్ వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉండేది. పవన్ వైఖరి కూడా దానికి తగ్గట్లే ఉండేది. అందుకే పవన్ రాజకీయాలన్నీ చంద్రబాబును కాపాడటం కోసమే అనే అభిప్రాయం బలపడిపోయింది.

అటువంటిది పవన్ ఒక్కసారిగా యూటర్న్ తీసుకోవటంతో అందరూ విస్తుపోయారు. దాదాపు రెండు గంటల పాటు మాట్లాడిన పవన్ గంటన్నర పాటు ఏకంగా చంద్రబాబు, లోకేష్ లను వాయించేశారు. అవినీతి, బంధుప్రీతి, ఇసుక మాఫియా, మహిళలపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలు ఇలా..ఒకటేంటి పదే పదే చంద్రబాబుపై దండెత్తారు.

గంటన్నర స్పీచ్ విన్న వారికి పవన్ పై అనుమానాలు మొదలయ్యాయి. ఆవిర్భావ దినోత్సవంలో పవన్ చేసిన ఆరోపణలన్నింటినీ వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, నేతలు ఎప్పటి నుండో చేస్తున్నవే. మరి అప్పుడంతా పవన్ ఎందుకు మాట్లాడలేదు? చంద్రబాబు, లోకేష్ అవినీతి పవన్ కు ఇపుడే  కనిపించిందా? ఇంతకాలం కనిపించని అవినీతి ఇపుడే ఎందుకు కనిపించింది? అదికూడా జనసేన కార్యాలయం, పవన్ ఇంటికి భూమిపూజ జరిగిన మరుసటి రోజే.

మొత్తం మీద పవన్ స్పీచ్ తో జనాల్లో గందరగోళం మొదలైందన్నది వాస్తవం. చంద్రబాబు-పవన్ ఆడుతున్న మరో నాటకమా? లేకపోతే నిజనిర్ధారణ కమిటి తర్వాతే పవన్ వైఖరిలో మార్పు వచ్చిందా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. టిడిపి నేతలైతే పవన్ మాటల వెనుక మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, బిజెపి ఎంఎల్ఏ విష్ణుకుమార్ రాజు ఉన్నారంటూ ఎదురుదాడి మొదలుపెట్టారు.

మొత్తంమీద ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో చంద్రబాబుకు కొత్త శత్రువు తయారయ్యారా? అన్న చర్చకూడా మొదలైంది. ఒకవైపు జగన్, ఇంకోవైపు బిజెపి, తాజాగా పవన్ కల్యాణ్ ఇలా..ఒక్కొక్కరు దండెత్తుతుంటే టిడిపి నేతలు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos