మోదీ తీసిన నోట్ల దెబ్బకి హాహాకారాలు చేస్తూ ప్రజలంతా రోడ్ల మీద పడితే పవన్ కల్యాణ్ కు  కనిపించకపోవడమేమిటో

జనసేన నాయకుడు పవన కల్యాణ్ తో వచ్చిన చిక్కే ఇది. 

అయన లెక్కలు అంత పక్కాగా ఉండవు. పబ్లిక్ మీటింగ్ లో ఆయనకు విపరీతమయిన సామాజిక నిస్పృహ అవహిస్తుంది. తిక్కరేగుతుంది. మీటింగ్ కు వచ్చిన పిల్లోళ్లు చప్పట్లు కొడతారు. అయితే, ఆయన తిక్కకి లేక్కేమి లేదని పిస్తుంది.

అనంతపురం రాయలసీమ హక్కుల చైతన్య సభ అన్చెప్పి మీటింగ్ పెట్టి చాలా విషయాలు వంకర లేకుండా చెప్పాడని అనుకుంటున్నపుడు ఆయన మళ్లీ తనదయిన సినిమా ప్యూపా లోకి వెళ్లిపోయాడు. మళ్లీ ఎపుడొస్తాడో తెలియదు.ప్యూపా దశలో ఉన్నపుడు ప్రపంచం కనిపించదు. మత్తులో ఉన్నట్లుంటుంది. అన్ని కలిసొస్తేనే సీతాకోక చిలుకయి ఎగరిరావచ్చు లేదా ప్యూపాలోనే అంతం కావచ్చు. 

ప్యూపా చాలా ఆశలు రెకెత్తిస్తుంది రాబోయే రంగురంగుల సీతాకోక చిలుక గురించి...అయితే, ప్యూపా కీటకం ఇంకా ఎదగని లేని దశకు చిహ్నం.

ఆయన అనంతపురంలో పెద్ద సభలోనే మాట్లాడాడు. అపుడు పార్టీ కార్యాలయం అనంతపురం లోనే పెడతానన్నాడు, అనంతపురం నుంచి పోటీ చేస్తానన్నాడు. సింగపూర్ లీ క్వాన్ యూ ఫిలాసఫీని పొగిడారు.అమరావతి వేస్టన్నారు. నాయుళ్లిద్దురు ఆంధ్రోళ్లను ముంచుతున్నాడని అన్నారు. ఇలా ఎన్నో విషయాలు చెప్పినా ఆయన అయిదొందల, వేయినోట్ల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పోనీలే, ప్రధాని వాటిని రద్దు చేసి రెండ్రోజులే కదా అయింది , వాటి వల్ల ఇంకా నష్టం బయటపడలేదనుకుందాం. మరిపుడేమిటి? స్పందించేందుకు వారం రోజలు చాలవా?

అనంతపురం మీటింగ్ జరిగి అర్రోజులయింది. ప్రధాని విపత్కర నిర్ణయం ప్రకటించి వారం దాటింది. ఈ వారంలో పాత నోట్ల రద్దు సృష్టించిన అల్ల కల్లోలం మీద ప్రపంచమంతా వ్యాఖ్యానించింది. నోట్ల మార్పిడి కోసం క్యూలో నిలబడుకుని అలసట, గండెపోటు వచ్చి మొదటి ఆరు రోజులలోనే 25 మంది చనిపోయారు.అయినా పవన్ లో ఉలుకు లేదు పలుకు లేదు.

దేశంలో బ్యాంకున్న ప్రతిచోట, ఏటిఎం ఉన్న ప్రతి సందులో వందల వేల మంది నాలుగు నోట్ల కోసం ఇల్లొదిలి, ఆపీసొదిలి, జీవనం కోసం చేస్తున్న చిరు వ్యాపారాలొదిలి, అటోలొదిలి, రిక్షాలొదిలి, వ్యవసాయం వదిలి, వంటగదులువదిలి రోడ్డున పడిన వార్తలు తప్ప మరొక వార్త పత్రికల్లో గాని, టివిల్లో గాని, వెబ్ సైట్లో గాని రావడం లేదు. అయినా సరే జనసేన నాయకుడు ప్యూపాలోనే ఉండిపోయారు. దీన్ని చూసే స్థితిలో కూడా లేరు. ఆయనకిది కనిపించడంలేదు . దాదాపు నూరుకోట్ల మంది పడుతున్న కష్టాల మీద ఒక్క మాటయిన మాట్లాడలేదు. ఏమిటీ తిక్క. దీనికో లెక్క లేదా.

రాజకీయాల్లోలకి వచ్చి ప్రజలను నడిపించాలనుకునే వాడు భూమ్యాకాశాలకు చెవులానించి రిక్కించి వినాలని చెబుతారే. ఏదీ పవన్ ఏమయ్యాడు. ఇంత పెను కరెన్సీకంపం గురించి ఒక్క మాటయిన మాట్లాడటం లేదు. ఇది రాజకీయ లక్షణమా. లెక్క తేలాల్సిందే. ప్యూపాలో ఎదగకుండా అలా గే ఉంటాడా, రాజకీయ హంగులతో బయటకు ఎగిరొస్తాడా...చూద్దాం.