Asianet News TeluguAsianet News Telugu

జగన్ తో దోస్తీ: పవన్ కల్యాణ్ మౌనం వెనక...

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు మద్దతు ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ చేసిన ప్రకటన సంచలనమే అయింది.

Why Pawan is silent on Varaprasad statement?

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తమకు మద్దతు ఇస్తారని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు వరప్రసాద్ చేసిన ప్రకటన సంచలనమే అయింది. అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా కూడా మారింది. 

వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ వైసిపితో జత కడతారనే అర్థం వచ్చేలా వరప్రసాద్ మాటలు ఉన్నాయి. అయినా కూడా ఆ విషయంపై పవన్ కల్యాణ్ పెదవి విప్పలేదు. వామపక్షాలతో కలిసి నడుస్తానని మాత్రమే అన్నారు తప్ప వైసిపితో ఏ విధమైన సంబంధాలు ఉండవని ఆయన తెగేసి చెప్పలేదు. 

దాంతో జగన్, పవన్ కల్యాణ్ మధ్య స్నేహం కొనసాగుతోందని అనుకోవడానికి వీలు కలుగుతోంది. జగన్, పవన్ కల్యాణ్ బిజెపితో కలిసి పనిచేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో సహా టీడీపీ నేతలంతా అంటున్నారు. ఈ మాటలకు పవన్ కల్యాణ్ మౌనం బలం చేకూర్చే విధంగా ఉంది. 

ఎన్నికల్లో తాము ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని, తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చెబుతున్నారు. పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చినా తాము ఒంటరిగానే పోటీ చేస్తామని వైసిపి నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఇటీవల చెప్పారు. కానీ, పవన్ కల్యాణ్ తో దోస్తీ ఉండదని మాత్రం చెప్పలేదు.

పవన్ కల్యాణ్ తిరిగి ప్రజా పోరాట యాత్రకు శ్రీకారం చుట్టడానికి సిద్ధపడ్డారు. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వాగ్బాణాలు విసురుతున్నారు. అప్పుడప్పుడు వైఎస్ జగన్ ను కూడా విమర్శిస్తున్నారు. కానీ, జగన్ పై చేసే వ్యాఖ్యల్లో పదును లేదనే మాట వినిపిస్తోంది. 

బిజెపిని గానీ ప్రధాని మోడీని గానీ ఆయన పెద్దగా విమర్శించడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. పరిస్థితి చూస్తుంటే, చంద్రబాబుకు వ్యతిరేకంగా బిజెపితో కలిసి జగన్, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారా అనే అనుమానాలు కలగకమానవు.

వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినప్పటికీ పరిస్థితిని బట్టి ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ గానీ పవన్ కల్యాణ్ గానీ బిజెపికి మద్దతు ప్రకటించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios