ఇంకా రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది కాబట్టి విపక్షాల్లోని మహిళా నేతలు కూడా సదస్సులో పాల్గొనేట్లు చేయగలిగితేనే సదస్సు లక్ష్యాలు నెరవేరుతాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మహిళా పార్లమెంటేరియన్ల సాధికార సదస్సు’ లో ప్రతిపక్షాలకు చెందిన మహిళా ప్రజాప్రతినిధుల జాడే కనబడలేదు. వైసీపీలో మహిళా ఎంఎల్ఏ, ఎంపిలు సుమారు పదిమంది వరకున్నారు. మహిళల సమస్యలపైన ధాటిగా మాట్లాడగలిగిన వారు కూడా ఉన్నారు. దేశ, విదేశాల నుండి 12 వేల మంది హాజరవుతున్న ప్రతిష్టాత్మక మూడు రోజుల సదస్సులో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులు, నేతలు లేకపోవటం నిజంగా బాధాకరమే. వైసీపీ ఎంపి బుట్టా రేణుక తప్ప ఇంకెవరూ కనిపించలేదు.
రాష్ట్రంలో నెలకొన్న రాజకీయాల కారణంగా ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకోవటం మామూలే. ఇందులో భాగంగానే వైసీపీ-టిడిపి నేతల మధ్య కూడా రోజూ మాటల యుద్ధం జరుగుతున్నదే. అయితే, ఇపుడు మొదలైన సదస్సు మాత్రం రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నట్లు స్పీకర్ కోడెల శివప్రసాదరావు చెప్పుకొచ్చారు మొన్ననే. స్పీకర్ చెప్పిందే నిజమైతే ప్రతిపక్ష మహిళా ప్రతినిధులను, ఇతర పార్టీల్లోని మహిళా నేతలను కూడా ఇందులో భాగస్వాములను చేయాలి. అప్పుడే ఇటువంటి సదస్సులకు పరిపూర్ణత వస్తుంది. అందుకు స్పీకరే చొరవ తీసుకోవాలి.
సదస్సుకు ఆహ్వానించామని స్పీకర్ కార్యాలయం చెబుతోంది. తమకు ఆహ్వానాలు అందలేదని వైసీపీ నేతలంటున్నారు. బహుశా మొక్కుబడిగా ఆహ్వానాలు పంపారేమో. లేకపోతే తమకు ప్రభుత్వం ఇవ్వాల్సినంత గౌరవం ఇవ్వలేదని వైసీపీ అనుకుంటోందేమో. సరే, ఆహ్వానాలు పంపటం, అందకపోవటం మాట అటుంచితే మరోసారి స్పీకరే చొరవ తీసుకుని వారిని మళ్ళీ ఆహ్వానిస్తే హుందాగా ఉంటుంది. ఇంకా రెండు రోజుల పాటు సదస్సు జరుగుతుంది కాబట్టి విపక్షాల్లోని మహిళా నేతలు కూడా సదస్సులో పాల్గొనేట్లు చేయగలిగితేనే సదస్సు లక్ష్యాలు నెరవేరుతాయి.
