చివరి నిముషంలో కూడా చంద్రబాబునాయుడు పిల్లి మొగ్గలే వేస్తున్నారు. ప్రత్యేకహోదాపై ఎన్నిసార్లు మాట మార్చారో అందరికీ తెలిసొందే. ఇపుడు అవిశ్వాస తీర్మానం వంతు మొదలైంది. నిన్నటికి నిన్న గురువారం సాయంత్రమేమో వైసిపి ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. అటువంటిది శుక్రవారం ఉదయానికి కల్లా సీన్ మారిపోయింది. ఎప్పుడైతే ఎన్డీఏతో తెగతెంపులు చేసుకోవాలని నిర్ణయించారో వెంటనే ఆలోచన కూడా మారిపోయింది.

దాంతో కేంద్రప్రభుత్వంపై టిడిపినే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. వెంటనే వైసిపికి మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించారు. దాంతో పార్లమెంటు వేదికగా అసలేం జరుగుతోందో రాష్ట్ర ప్రజానీకానికి అర్ధం కావటం లేదు. ఒకసారి ప్రత్యేకహోదా అవసరం లేదని, ఇంకోసారి కావాలని, ఇపుడేమో ఒకసారి వైసిపికి మద్దతని మరోసారేమో ఇవ్వమని...ఇలా ఒకే విషయంపై ఇన్ని సార్లు మాటలు మార్చటం బహుశా చంద్రబాబుకు తప్ప ఇంకొకరికి సాధ్యం కాదేమో అని జనాలు నవ్వుకుంటున్నారు.