అఖిలను నమ్మి నియోజకవర్గాన్ని ఆమె చేతిలో పెడితే మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఇక ఉపఎన్నికను కూడా మంత్రి చేతిలో పెడితే నిండా ముణగటం ఖాయమని అర్ధమైపోయింది. దాంతో చంద్రబాబు మరమ్మతుకు దిగినట్లు సమాచారం.

నంద్యాల విషయంలో మంత్రి భూమా అఖిలప్రియను నమ్మి చంద్రబాబునాయుడు దెబ్బతిన్నారా? పార్టీ వర్గాలు అవుననే చెబుతున్నాయి. తాజాగా శిల్పామోహన్ రెడ్డి పార్టీలో ఉన్నంత వరకూ ఆయనకు వ్యతిరేకంగా అఖిల ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారట. దాంతో చంద్రబాబు కూడా అఖిల మాటలను నమ్మి నియోజకవర్గాన్ని ఆమెకే అప్పగించారు. దాంతో ఎలాగైనా ఉప ఎన్నికల్లో తమ కుటుంబానికి టెక్కెట్టు ఇప్పించుకోవాలని మంత్రి పావులు కదిపారు. దాని పర్యవసానమే శిల్పా టిడిపిని వదిలేసి వైసీపీలో చేరటం.

శిల్పా టిడిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కూడా చంద్రబాబు మంత్రితో మాట్లాడారట. అయితే, శిల్పా పార్టీని వీడినంత మాత్రాన వచ్చే నష్టమేమీ లేదని మంత్రి నమ్మబలికారు. చివరకు శిల్పాతో పాటు అనుచరులు కూడా భారీ ఎత్తున వైసీపీలో చేరిపోయారు. నంద్యాల మున్సిపల్ ఛైర్ పర్సన్ తో పాటు 25 మంది కౌన్సిలర్లు, జడ్పీటీసీ, ఎంపిటీసిలు, సర్పంచులతో పాటు పులువురు నేతలు పార్టీని వదిలేస్తారని ఎవ్వరూ ఊహించలేదట. సుమారు 2 వేల మందితో శిల్పా వైసీపీలో చేరిన విషయం తెలుసుకున్న చంద్రబాబు అఖిలపై మండిపడినట్లు సమాచారం.

నంద్యాల మున్సిపాలిటీలో 42 వార్డులున్నాయి. అందులో వైసీపీకి 13 మంది కౌన్సిలర్లు, టిడిపికి 29 మంది కౌన్సిలర్లున్నారు. అయితే, తాజా సమీరణల ప్రకారం శిల్పాతో 25 మంది కౌన్సిలర్లు వెళ్ళిపోయారు. అంటే ఇపుడు వైసీపీ బలం 38కి పెరిగింది. రేపటి రోజున నంద్యాల మున్సిపాలిటీకి ఛైర్మన్ ఎన్నిక జరిగితే వైసీపీ గెలవటం కష్టం కాదు. వివిధ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు. దాంతో ఇపుడు ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు.

అఖిలను నమ్మి నియోజకవర్గాన్ని ఆమె చేతిలో పెడితే మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది. ఇక ఉపఎన్నికను కూడా మంత్రి చేతిలో పెడితే నిండా ముణగటం ఖాయమని అర్ధమైపోయింది. దాంతో చంద్రబాబు మరమ్మతుకు దిగినట్లు సమాచారం. జరిగిన డ్యామేజి ఎటూ జరిగిపోయింది కాబట్టి ఇక నుండి జిల్లా ఇన్ఛార్జిమంత్రి కాల్వశ్రీనివాసులుకు ప్రత్యేకంగా నంద్యాల బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు యోచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.