నోట్ల రద్దు అంశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమటం, ఉభయ సభల్లోనూ అధికార పక్షం దాదాపు ఒంటరి అయిన విషయం స్పష్టంగా కనబడుతోంది.
పెద్ద నోట్ల రద్దుపై ప్రతిపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం ధీటైన సమాధానాలు చెప్పలేక సభను వాయిదా పలుమార్లు వేస్తూ నెట్టుకొస్తోంది. నాలుగు రోజులుగా పార్లమెంట్ జరుగుతున్నా ప్రధానమంత్రి మాత్రం హాజరుకావటం లేదు. దాంతో పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ రగడ జరుగుతున్నా నరేంద్రమోడి మొహం చాటేయటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
నోట్ల రద్దు విషయంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకిపారేస్తున్నాయి. పైగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బహిరంగ సభలకు మోడి హాజరవుతూ ఇదే అంశంపై విపక్షాలను విమర్శిస్తుండటం గమనార్హం.
నోట్ల రద్దు చేసిన రోజున పార్లమెంట్లో ప్రతిపక్షాల విమర్శలకు తగిన సమాధానమిస్తామని ప్రకటించిన ప్రధాని ఆ తర్వాత అసలు మొహం కూడా చూపలేదు. దానికితోడు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ సభలోనే ఉన్నా ప్రతిపక్షాల ఆరోపణలకు, విమర్శలకు పెద్దగా స్పందించటం లేదు. అదేవిధంగా, ఎన్డిఏలోని భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటానికి పెద్దగా ఆశక్తి చూపటం లేదు.
నోట్ల రద్దు అంశానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమటం, ఉభయ సభల్లోనూ అధికార పక్షం దాదాపు ఒంటరి అయిన విషయం స్పష్టంగా కనబడుతోంది. విపక్ష సభ్యుల ప్రశ్నలకు ఏదో మొక్కుబడిగా మంత్రులు రవిశంకర్ ప్రసాద్, వెంకయ్యనాయడు, ప్రకాశ్ జవదేకర్ సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తోంది.
13 రోజులుగా దేశాన్ని పట్టి కుదిపేస్తున్న నోట్ల రద్దు అంశంపై ప్రతిపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పుకోలేక అధాకార పక్షం చాలా ఇబ్బందులు పడుతోందన్నది వాస్తవం. దాంతో నోట్ల రద్దు అంశంపై సభలో చర్చ జరగకుండా భాజపా నెట్టుకొస్తోంది.
