ఎన్టీఆర్ కుటుంబం మొత్తం పార్టీకి దూరమైపోయిందని సగటు కార్యకర్త నిర్ణయానికి వచ్చారు. ఇపుడు జరుగుతున్న మహానాడులో కుటుంబసభ్యుల జాడే కనబడలేదు. దాంతో నేతల మద్య అదే విషయమై చర్చ జరుగుతోంది. నేతల్లో కొద్దిమందికి మాత్రమే ఎన్టీఆర్ తో అనుబంధముంది. 1994 తర్వాత పార్టీలోకి వచ్చిన నేతలెవరికీ ఎన్టీఆర్ తో ఎటువంటి సంబంధాలు లేవు

తెలుగుదేశం పార్టీ రెండేళ్ళకోసారి నిర్వహించుకుంటున్న మహానాడుకు కళ తప్పింది. ఎన్టీఆర్ ఉన్నపుడు జరిగిన ప్రతీ మహానాడులోనూ నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం పొంగిపొర్లేది. క్రమంగా ఆ ఉత్సాహం నిరుగారీపోయింది. పార్టీ వ్యవస్ధాపక అధ్యక్షుడైన ఎన్టీఆర్ జ్ఞాపకాలే లేకుండా చేస్తుండటంతో మహానాడుకు కళతప్పిందని నందమూరి అభిమానులు ఆవేధన చెందుతున్నారు.

ఎన్టీఆర్ పుట్టినరోజున ప్రతీ రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు మహానాడు జరుపుకోవటం టిడిపి ఆనవాయితీ. అయితే, ఎన్టీఆర్ నే పదవి నుండి దింపేయటం, ఆయన మృతికి కారణమైన వారే మళ్ళీ మహానాడును జరుపుతుండటాన్ని ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఆ విషయాలను గ్రహించే టిడిపి నాయకత్వం ఎన్టీఆర్ నిజమైన అభిమానులను పార్టీకి దూరం చేయటం ద్వారా ఎన్టీఆర్ గుర్తులు కూడా లేకుండా జాగ్రత్తపడింది. కాకపోతే మహానాడు ఎందుకు నిర్వహిస్తారో అందరికీ తెలిసిందే కాబట్టి ఏదో మొక్కుబడిగా ఎన్టీఆర్ కు నివాళి, ఆయన నటించిన చిత్రాల తాలూకు ఎగ్జిబిషన్ లాంటివి మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. చివరకు ఎన్టీఆర్ కుటుంబసభ్యులు కూడా మహానాడుకు దూరమైనట్లే కనబడుతోంది.

ఇపుడు జరుగుతున్న మహానాడులో చంద్రబాబునాయుడు స్పీచ్ నే తీసుకుందాం. మహానాడులో చేస్తున్న తీర్మానాలకు క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వాటికి ఏమన్నా పొంతన ఉందా? నీతిమంతమైన పాలనకు, నిజాయితీకి శ్రీకారం చుట్టాలని చంద్రబాబన్నారు. కానీ జరుగుతున్నదేమిటి? వ్యవస్ధలన్నీ అవినీతిమయమైపోయాయని ప్రతిపక్షాలు గోలచేస్తున్నాయ్. కాంగ్రెస్ ప్రభుత్వానికి మించి అవినీతి పెరిగిపోయిందని భాజపా నేతలే బహిరంగంగా ధ్వజమెత్తుతున్నారు కదా?

ఎన్టీఆర్ ఫిరాయింపులకు పూర్తి వ్యతిరేకం. కానీ జరుగుతున్నదేమిటి? పారిశ్రామికవేత్తలను దూరంగా ఉంచాలని ఎన్టీఆర్ చెప్పేవారు. కానీ ఇపుడు పార్టీ మొత్తం పారిశ్రామికవేత్తల చేతుల్లో ఇరుక్కుపోయింది. ఎన్టీఆర్ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు చాలా తక్కువ. కానీ ఇపుడు పార్టీలో ఆర్ధిక నేరగాళ్ళు, బ్రోకర్లు ఎక్కువైపోయారని ప్రతిపక్షాలు ఆరోపణలు ఎక్కువైపోయాయి.

చివరగా, ఎన్టీఆర్ కుటుంబం మొత్తం పార్టీకి దూరమైపోయిందని సగటు కార్యకర్త నిర్ణయానికి వచ్చారు. ఇపుడు జరుగుతున్న మహానాడులో కుటుంబసభ్యుల జాడే కనబడలేదు. దాంతో నేతల మద్య అదే విషయమై చర్చ జరుగుతోంది. నేతల్లో కొద్దిమందికి మాత్రమే ఎన్టీఆర్ తో అనుబంధముంది. 1994 తర్వాత పార్టీలోకి వచ్చిన నేతలెవరికీ ఎన్టీఆర్ తో ఎటువంటి సంబంధాలు లేవు. వారికి తెలిసిందంతా చంద్రబాబునాయుడు మాత్రమే. అందుకే మహానాడు అంటే ఎన్టీఆర్ కాదు కేవలం చంద్రబాబు మాత్రమే అని అనుకుంటున్నారు.