ఇవి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాజాగా  చేసిన వ్యాఖ్యలు. సోమవారం కొండగట్టులో ప్రత్యేకపూజలు చేసిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే పవన్ చిత్తశుద్దిపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదేళ్ళ క్రితం పార్టీ పెట్టినపుడు ప్రశ్నించటానికే తాను పార్టీ పెడుతున్నట్లు ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. సమస్యలపై నిలదీయటంలో తాను మొహమాటాలకు పోనని జనాలకు హామీ ఇచ్చారు. ఎవరినైనా సరే చొక్కా పట్టుకుని నిలదీసే దమ్ము, ధైర్యం తనకున్నాయంటూ వేదికపై నుండి ప్రకటించుకున్నారు.

పవన్ ఆవేశపూరిత ప్రసంగాలను చూసి అందరూ నిజమే అనుకున్నారు. ఇంకేముంది ప్రభుత్వానికి ముచ్చెమటలు పోయిస్తారు పవన్ అని అందరూ భావించారు. అప్పటి నుండి ఇప్పటి వరకూ పవన్ ఏపి ప్రభుత్వం గురించి ఒక్క మాట కూడా మాట్లడలేదు. చంద్రబాబునాయుడను ఉద్దేశించి ఒక్క  ప్రశ్న కూడా వేయనేలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) తేల్చింది.

సరే, ఇక రాష్ట్ర విభజన హామీల అమలు గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంతమంచిది. అధికారయంత్రాంగంపై చంద్రబాబు పట్టు కోల్పోయింది వాస్తవం. పార్టీ నేతలు కూడా పూర్తిగా బరితెగించేశారు. కేంద్రం మెడలు వంచి చంద్రబాబు ఒక్క పని కూడా చేయించలేకపోతున్నారు. చివరకు ప్రధానమంత్రి అపాయిట్మెంట్ కోసం ఏడాదిన్నర ఆగాల్సి వచ్చింది. చంద్రబాబులో ఇన్ని వైఫల్యాలు అందరకి కనబడుతున్నా పవన్ కు మాత్రం ఒక్కటి కనబడలేదు. అందుకే పవన్ ను అందరూ ‘చంద్రబాబు జేబులోని మనిషే’ అంటూ ముద్రవేసేశారు.

అదే సమయంలో చంద్రబాబు వైఫల్యాలపై ఆందోళనలు చేస్తున్న వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపైన మాత్రం పవన్ విమర్శలు చేస్తున్నారు. సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షం విఫలమైందని వ్యాఖ్యలు చేశారు. ఇక్కడే పవన్ వైఖరిపై అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. ఎవరైనా అధికారంలో ఉన్న వారిని విమర్శిస్తారు లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తారు. పవన్ మాత్రం విచిత్రంగా వైసిపిని టార్గెట్ చేస్తున్నారు. వైసిపి ఎప్పుడు ఆందోళనలు మొదలుపెట్టినా వెంటనే పవన్ కూడా రంగంలోకి దూకుతున్నారు. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే  పవన్ అసలెందుకు రాజకీయాల్లోకి వచ్చాడో అర్ధం కావటం లేదు.