చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనల్లో అయిన ఖర్చుల విషయాన్ని ప్రభుత్వం ఎందుకంత గోప్యంగా ఉంచుతోందో అర్ధం కావటం లేదు. మూడున్నరేళ్ళుగా చంద్రబాబుతో పాటు మంత్రి అయిన తర్వాత కొడుకు నారా లోకేష్ కూడా ఎన్నో సార్లు విదేశాలకు వెళ్ళి వచ్చిన సంగతి అందరకి తెలిసిందే. ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము విదేశాలకు వెళుతున్నట్లు చెబుతున్నారు.

పైగా తాము విదేశాల్లో పెట్టుబడుల కోసం వెళ్ళామని చెబుతున్న తండ్రి, కొడుకులు తాము ఎవరెవరితో సమావేశాలు నిర్వహించింది, ఎవరెవరనికి కలిసింది లాంటివి ఫొటోలు కూడా పంపిణీ చేయించారు. సరే, విదేశాల్లో వాళ్ళిద్దరి పర్యటనల వల్ల రాష్ట్రానికి ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయో అందరికీ తెలిసిందే.

అదే సందర్భంలో వాళ్ళిద్దరి విదేశీ పర్యటన వల్ల రాష్ట్ర ఖజానాకు ఏ మేరకు భారం పడిందో తెలుసుకునేందుకు ప్రకాశం జిల్లావాసి ఒకరు సమాచారం అడిగారు. సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే, చంద్రబాబు, లోకేష్ విదేశీ ప్రయాణాలకైన ఖర్చుల వివరాలు ఇచ్చేందుకు లేదంటూ సమాధానం వచ్చింది.

ప్రధానమంత్రి, రాష్ట్రపతుల విదేశీ పర్యటనల ఖర్చులనే సమాచారం హక్కు చట్టం ద్వారా అడిగినపుడు కేంద్రం అందిస్తోంది. మరి, చంద్రబాబు, లోకేష్ కు సంబంధించిన వివరాలు ఇవ్వటానికి ఎందుకు ఇష్టపడటం లేదో అర్ధం కావటం లేదు. ఎవరు విదేశాలకు వెళ్ళినా ప్రజాధనమే కదా ఖర్చయ్యేది.