కేంద్రానికి ఎన్నిసార్లు దండాలు పెడతారో చంద్రబాబునాయుడు అర్ధం కావటం లేదు. మామూలుగా అయితే ఎవరైనా ఎదురుపడినపుడు ఎవరైనా సరే మొదటిసారి ఎదురుపడినపుడు మాత్రమే దండం పెడతారు. కానీ చంద్రబాబేమో కేంద్రానికి పదే పదే దండాలు పెడుతూనే ఉన్నారు. ఎందుకన్ని సార్లు దండాలు పెడుతున్నారు? ఇంకెన్నిసార్లు దండాలు పెడతారంటే స్పష్టంగా చెప్పరు. ఇప్పటికే రెండుసార్లు పోలవరంపై దండాలు పెట్టారు. రాజధాని నిధుల విషయంలో ఒకసారి దండం పెట్టారు. ప్రత్యేకప్యాకేజి విషయంలో ఓసారి దండం పెట్టారు. తాజాగా బడ్జెట్ విషయంలో మరోసారి కేంద్రానికి దండం పెట్టారు.

చంద్రబాబు పెడుతున్న దండాలపై తమ్ముళ్ళలోనే విసుగొచ్చేస్తోంది. భారతీయ జనతా పార్టీతో పొత్తులు వద్దని తమ్ముళ్ళు నెత్తీ నోరు మొత్తుకుంటున్నారు. భాజపాతో పొత్తు వల్ల ఇప్పటికే రాష్ట్రంతో పాటు టిడిపి కూడా జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తమ్ముళ్ళలో ఆందోళన మొదలైంది. అదే విషయాన్ని అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్, టిజి వెంకటేష్ లాంటి వాళ్ళు బహిరంగంగానే చెబుతున్నారు. బడ్జెట్ కేటాయింపులు చూసిన తర్వాత కూడా ఇంకా భాజపాతో పొత్తు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో  ఇబ్బందులు తప్పవని చెవిలో ఇల్లుకట్టుకుని మరీ పోరుతున్నారు. అయినా వారిని చంద్రబాబు వెనక్కు లాగుతున్నారు. ఎందుకు?

ఇక్కడే వారు మరచిపోయిన విషయం ఒకటుంది. భాజపాతో పొత్తులు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఇబ్బందులు తప్పవన్న విషయం వాస్తవమే. కానీ భాజపాతో పొత్తు వద్దనుకున్న మరుక్షణం నుండి చంద్రబాబుకు వ్యక్తిగతంగా సమస్యలు మొదలవుతాయి. ‘ఓటుకునోటు’ కేసులో పీకల్దాక చంద్రబాబు ఇరుకుపోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఏదో కేంద్రం దయవల్ల చంద్రబాబు ముఖ్యమంత్రిగా నెట్టుకొస్తున్నారు. నిజంగానే భాజపాతో పొత్తు వదులుకున్న మరుక్షణం ఓటుకునోటు కేసు విచారణ మొదలైందంటే అంతే సంగతులు.

అసలే కేసు సుప్రింకోర్టు విచారణలో ఉంది. చంద్రబాబు మీద గనుక చార్జిషీట్ ఫైల్ చేయమని కోర్టు గనుక ఆదేశిస్తే ముందు సిఎంగా రాజీనామా చేయక తప్పదు. తర్వాత విచారణకు చంద్రబాబు హాజరైతే ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అపుడు వచ్చే ఎన్నికల దాకా అవసరం లేదు ఇపుడే టిడిపి పుట్టి ముణుగుతుంది. అందుకనే ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తిడిపెడుతున్నా చంద్రబాబు మాత్రం దండాలు పెట్టడంతోనే కాలం నెట్టుకొస్తున్నారు.