మొత్తానికి జగన్ ఒక విధంగా విజయం సాధించినట్లే. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతుగానో లేకపోతే సొంతంగానే ప్రవేశపెట్టే పరిస్ధితిలోకి చంద్రబాబునాయుడును నెట్టటంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఎందుకంటే, ప్రత్యేకహోదాకు వ్యతిరేకంగా మాట్లాడిన చంద్రబాబుతోనే అనుకూలంగా నిర్ణయం తీసుకునేట్లు చేయటం మామూలు విషయం కాదు. సరే, చివరకు అవిశ్వాస తీర్మానం ఏమవుతుందన్నది వేరే సంగతి. తీర్మానం చర్చకు రాకముందే రాష్ట్ర రాజకీయాల్లో జగన్ పై చేయి సాధించినట్లైంది.

40 ఏళ్ళ రాజకీయ జీవితంలో చంద్రబాబునాయుడు విచిత్రమైన సమస్యలో ఇరుకున్నారు. ఈ సమస్య తనకు సంబంధం లేకుండా మొదలైంది కాబట్టే పరిష్కారం కూడా చంద్రబాబు చేతిలో లేదు. అందుకనే సమస్య నుండి బయటపడటానికి నానా అవస్తలు పడుతున్నారు.

ఇక విషయానికి వస్తే ప్రత్యేకహోదాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించటంలోనే చంద్రబాబులో ఏ స్ధాయిలో ఒత్తిడి పెరిగిపోతోందో అర్దమవుతోంది.  చివరకు సొంతంగానే తీర్మానం ప్రవేశపెట్టాలని కూడా నిర్నయించారు. ఒకవైపు ఒత్తిడి మరోవైపు ఆక్రోశం చంద్రబాబులో స్పష్టంగా కనబడుతోంది.

తాను మద్దతు ఇవ్వకపోయినా వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారని చంద్రబాబుకు అర్ధమైపోయింది. టిడిపి మద్దతు అవసరం లేకుండానే తీర్మానం చర్చకు రావటానికి సరిపడా సభ్యుల బలాన్ని వైసిపి కూడగట్టింది. దాంతో వైసిపికి మద్దతు ఇవ్వకపోతే రాష్ట్రంలో జనాల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందని చంద్రబాబు గ్రహించారు. అది రేపటి ఎన్నికల్లో చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.

ఇక, రాష్ట్రం విషయంలో కావచ్చు లేదా తన వ్యక్తగత విషయంలో కావచ్చు కేంద్రం లేదా బిజెపి అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరితో చంద్రబాబు మండిపోతున్నారు. అందుకే ఒత్తిడికి తట్టుకోలేకే చివరకు ఎన్డీఏలో నుండి కూడా బయటకు వచ్చేశారు. అదే సమయంలో తనతో పాటు లోకేష్ ను లక్ష్యంగా చేసుకుని జనసేన అధ్యక్షుడు పవన్ చేసిన ఆరోపణలు, విమర్శలతో చంద్రబాబులోని ఆగ్రహం తీవ్రస్దాయికి చేరుకుంది. బిజెపినే పవన్ వెనకుండి తనను గబ్బు పట్టిస్తోందన్నట్లుగా ఆరోపిస్తున్నారు.

కేంద్రమంత్రి వర్గంలో నుండి బయటకు వచ్చేసినా కేంద్రంలో చలనం లేదు. కాబట్టి ఎన్డీఏలో నుండి వచ్చేసినా పెద్ద తేడా ఏమీ ఉండదు. కాబట్టే ఎన్డీఏలో నుండి కూడా వచ్చేయాలని నిర్ణయించారు.