పోలవరం కాంక్రీటు పనులకు శుక్రవారం జరిగిన శంకుస్ధాపన కార్యక్రమంలో ఓ విషయం గమనించారా?  రాష్ట్రంలో జరిగే ప్రతీ కార్యక్రమానికి కేంద్రం తరపున తప్పకుండా హాజరయ్యే నిలయవిధ్వాంసుడు వెంకయ్య ఎక్కడా కనబడలేదు

 

రా ష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నిర్వహించే పండుగలకు భారతీయ జనతా పార్టీ నేతలు దూరంగా ఉండక తప్పదేమో. గడచిన రెండున్నరేళ్ళుగా ఏదో ఓ పేరుతో చంద్రబాబు ప్రతీ సందర్భాన్ని పెద్ద పండుగ రూపంలో నిర్వహిస్తున్నారు. జరిగిన శంకుస్ధాపనలను, ప్రారంభోత్సవాలను మళ్ళీ మళ్లీ జరిపిస్తున్నారు అట్టహాసంగా.

 

ప్రతీ పండుగకు కోట్లాది రూపాయల ప్రజాధనం మంచినీళ్ళల్లాగ ఖర్చవుతున్నా లెక్క చేయటం లేదు. అయితే, ఎక్కడ ఏమి జరిగినా ఖచ్చితంగా హాజరయ్యే నిలయ విధ్వాంసుడు ఒకరుంటారు. ఆయనే కేంద్ర మంత్రి వెంకయ్యనాయడు. అటువంటిది పోలవరం కాంక్రీట్ పనులకు చంద్రబాబు శుక్రవారం శంకుస్ధాపన చేసారు. ఆ సందర్భంగా  భారీ ఎత్తున బహిరంగ సభ కూడా నిర్వహించారు.

 

అంతటి బహిరంగ సభ జరుగుతున్నపుడు వెంకయ్య మాత్రం వేదికపైన లేకపోవటం పలువురిని ఆశ్చర్యపరిచింది. వెంకయ్యే కాదు..కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి కూడా గైర్హాజరయ్యారు. పైగా పోలవరం శంకుస్ధాపన కార్యక్రమానికి స్వయంగా చంద్రబాబు పిలిచారు. ఆమె కూడా తప్పక వస్తానని హామీ కూడా ఇచ్చారు. అయినా రాలేదు.

అలాగే, ఏపి నుండి రాజ్యసభలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపి, కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు కూడా హాజరు కాలేదు. పైగా ప్రభు రాష్రంలోనే ఉన్నారు. అయినా సభకు హాజరుకాలేదు. విషయమేమిటని ఆరాతీస్తే ఆశక్తికరమైన విషయం తెలిసింది.

 

చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో పండుగలు బాగా ఎక్కువైపోయినట్లు భాజపా కేంద్ర నాయకత్వంలో అసహనం పెరిగిపోతోందట. అందుకనే టిడిపి నిర్వహించే పండుగులకు తప్పని సరైతే తప్ప హాజరు కావద్దని ఆదేశాలు కూడా జారీ అయ్యాయట. దాని ఫలితంగానే పోలవరం పండుగకు భాజపా మంత్రులు డుమ్మా కొట్టారట. మరి ఇది దేనికి సంకేతాలో....