భాను కిరణ్ గురించి మద్దెలచెర్వు సూరి భార్య ఏమన్నారంటే...
డబ్బుల కోసమే భాను కిరణ్ తన భర్తను చంపాడని మద్దెలచెర్వు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి భార్య భానుమతి ఆరోపించారు
అనంతపురం: డబ్బుల కోసమే భాను కిరణ్ తన భర్తను చంపాడని మద్దెలచెర్వు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణ రెడ్డి భార్య భానుమతి ఆరోపించారు. తన భర్త ఏనాడూ డబ్బుల కోసం ఆలోచించలేదన్నారు. తన భర్త పేరు చెప్పుకొని భానుకిరణ్ డబ్బులు వసూలు చేసేవాడని ఆమె చెప్పారు.
మద్దెల చెర్వుసూరి భార్య భానుమతితో ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌కు సోమవారం నాడు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో పలు విషయాలను ఆమె వెల్లడించారు.
పరిటాల రవి హత్య కేసు గురించే తన భర్త ఎప్పుడూ ఆలోచించేవాడని ఆమె చెప్పారు. డబ్బుల గురించి ఆయన ఏనాడూ పట్టించుకొనేవాడు కాదన్నారు కానీ తన భర్త పేరు చెప్పుకొని భానుకిరణ్ డబ్బులు వసూలు చేసేవాడని ఆమె ఆరోపించారు.
తాను రాజకీయాల్లో ఉన్న సమయంలో తనకు డబ్బులు అవసరమని పంపాలని కోరినా కూడ ఆలస్యంగా డబ్బులు పంపేవాడని ఆమె గుర్తు చేసుకొన్నారు.భానుకిరణ్ ను సూరి అతిగా నమ్మాడని చెప్పారు. చాలా కాలంగా ప్లాన్ చేసి సూరిని భాను హత్య చేశాడని ఆమె ఆరోపించారు.తన భర్త పేరు చెప్పి వందల కోట్లను భాను సంపాదించాడన్నారు.
తన కొడుకును ఫ్యాక్షన్‌కు దూరంగా పెంచుతానని చెప్పారు. ఫ్యాక్షన్ పడగ నీడ తన కొడుకు దరి చేరకుండా చూస్తానని చెప్పారు. తాను వైసీపీలో చురుకుగా పనిచేయనున్నట్టు ఆమె తెలిపారు. పార్టీ నాయకత్వం ఎవరికీ టిక్కెట్టు ఇచ్చినా కూడ వారి గెలుపు కోసం పని చేస్తానని ఆమె చెప్పారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసుపై మంగళవారం నాడు తీర్పు వెలువడనుంది. సూరిని భాను కిరణ్ హత్య చేసి ఎనిమిదేళ్లు అవుతోంది.