మెట్రో రైల్ : చంద్రబాబుకు ఆహ్వానం లేనట్లే

మెట్రో రైల్ : చంద్రబాబుకు ఆహ్వానం లేనట్లే

ప్రతిష్టాత్మకమైన హైదరాబాద్ మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆహ్వానం లేనట్లే. ఎందుకంటే, ఆహ్వానితుల జాబితాలో చంద్రబాబు పేరు లేదని విశ్వసనీయవర్గాలు చెప్పాయి. అదే సమయంలో మెట్రో ప్రారంభోత్సవం జరుగుతున్న మంగళవారం నాడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చంద్రబాబులు సంయుక్తగా పాల్గొనే కార్యక్రమాలు విజయవాడలో ఉన్నాయి. దాంతో చంద్రబాబు హైదరాబాద్ కు రావటం లేదన్న విషయం దాదాపు ఖరారైనట్లే.

ప్రధానమంత్రి నరేంద్రమోడి పాల్గొంటున్న ఇంతటి కీలకమైన కార్యక్రమానికి చంద్రబాబును తెలంగాణా ప్రభుత్వం దూరంగా ఉంచటంపై మిశ్రమ స్పందన కనబడుతోంది. హైదరాబాద్ అన్నది విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రోటోకాల్ ప్రకారం రాజధాని పరిధిలో ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి కీలక వ్యక్తులు వచ్చినపుడు వారికి ఆహ్వానం పలికే వారిలో చంద్రబాబు పేరు కూడా ఉండాలి. అదే విధంగా గవర్నర్ కూడా ఉమ్మడి రాష్ట్రాలకు ఒకరే కాబట్టి రాజభవన్లో జరిగే ప్రతీ ఫంక్షన్ కూ ప్రోటోకాల్ ప్రకారం ఇద్దరు ముఖ్యమంత్రులకు గవర్నర్ కార్యాలయం నుండి ఆహ్వానాలు అందుతున్న విషయం తెలిసిందే.

అటువంటిది, మెట్రో రైలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి చంద్రబాబుకు ఇంత వరకూ ఆహ్వానం అందకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఉద్దేశ్యపూర్వకంగానే తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఏపి సిఎంను దూరంగా పెట్టారా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే, చంద్రబాబును కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రధానితో ఎలాగూ మాటలు కలుపుతారు. అప్పుడు మెట్రో రైలు వ్యవస్ధకు తానే రూపకల్పన చేశానని చెప్పుకుంటారు. ప్రపంచంలో ఎక్కడికెళ్ళినా హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని, సైబరాబాద్ ను తానే నిర్మించానని చెప్పుకోవటం చంద్రబాబుకు అలవాటు. నిజానికి మెట్రో పనులు చాలా వరకూ 2014కే పూర్తయ్యింది.

అయితే, మెట్రో ప్రారంభం లాంటి క్రెడిట్ మొత్తం తనకే దక్కాలని కెసిఆర్ అనుకోవటం సహజం. కాబట్టే చంద్రబాబును కెసిఆర్ దూరంగా పెట్టారేమో అని పలువురు అనుమానిస్తున్నారు. ఏదేమైనా చంద్రబాబును ఆహ్వానించకపోవటం పెద్ద వెలితే అని చెప్పక తప్పదు. అమరావతి శంకుస్ధాపన కార్యక్రమానికి కెసిఆర్ ను చంద్రబాబు ఆహ్వానించిన సంగతి మరచిపోకూడదు. ప్రోటోకాల్, విభజన చట్టం కన్నా కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాల కోసమన్నా పిలిచి ఉండాల్సింది.   

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos