ఎన్నికలు, ముఖ్యమంత్రి పదవి, రాజధాని నిర్మాణం మాట ఎలాగున్నా చంద్రబాబునాయుడు చేష్టలతో జగన్మోహన్ రెడ్డి మాటలతో జనాలకు మాత్రం భలే వినోదం.
రాజధాని గ్రామాల్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన తర్వాత ఓ విషయమై పెద్ద చర్చ మొదలైంది. ఇంతకీ రాజధాని అమరావతి నిర్మించేది ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడా లేక ప్రతిపక్ష నేత వైఎస్ జగనా? ఎందుకంటే, గడచిన రెండున్నరేళ్ళుగా ప్రపంచ ప్రఖ్యాత రాజధాని నిర్మించే అద్భుత అవకాశం తనకు వచ్చిందని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఆ పేరుతో చంద్రబాబు విదేశాలు తిరుగుతున్నారు. ప్రపంచంలోని అత్యున్నతమైన ఆర్కిటెక్టులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
త్వరలో రాజధాని నిర్మాణ పనులు మొదలవుతాయంటూ గడచిన ఏడాదిన్నరగా చెబుతున్నారు. రాజధాని నిర్మాణం జరగాలంటే తనకే మరో 30 ఏళ్ళు అధికారం కట్టబెట్టాలంటూ పలు బహిరంగ సభలో చంద్రబాబు ప్రజలకు చెబుతున్నారు. అంటే జీవితపర్యంతం తానే ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబు గట్టిగా కోరుకుంటున్నారు. తప్పులేదులేండి.
మరి అదే విషయమై తాజాగా జగన్ కూడా పోటీ పడుతున్నారు. తాను అధికారంలోకి రాగానే ప్రజా రాజధానిని నిర్మిస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు. అంటే అర్ధంఏమిటి? రాజధానిని నిర్మంచటం చంద్రబాబుకు సాధ్యం కాదనా? ఎన్నికలకు రెండున్నరేళ్ళుంది. అప్పటి వరకూ చంద్రబాబే సిఎం. మరి రాజధాని నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఈ రెండున్నరేళ్లలో ఎందుకు లేదనే విషయాన్నిజగనే స్పష్టం చేయాలి.
పైగా గతంలో చాలాసార్లు తాను అధికారంలోకి రాగానే రైతులకు ఎవరి భూములు వారికి తిరిగి ఇచ్చేస్తానని కూడా జగన్ బహిరంగంగా హామీ ఇచ్చారు. మరి రైతులకు వారి భూములను తిరిగి ఇచ్చేస్తే ఇక రాజధాని నిర్మాణానికి భూములు ఎక్కడుంటాయి. అంటే, తాజా వ్యాఖ్యలను బట్టి రైతులకు భూములు తిరిగి ఇవ్వటం ఉత్తదేనా? ఎన్నికలు, ముఖ్యమంత్రి పదవి, రాజధాని నిర్మాణం మాట ఎలాగున్నా చంద్రబాబునాయుడు చేష్టలతో జగన్మోహన్ రెడ్డి మాటలతో జనాలకు మాత్రం భలే వినోదం.
