ఉర్జిత్ కాకపోయినా ఎవరో ఒకరిపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది.
పెద్ద నోట్ల రద్దు పాపమెవరిదనే విషయమై దేశవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి. అధికార పార్టీ ఏమో రిజర్వ్ బ్యాంకు అధికారులదే తప్పని చెబుతుంటే, ఉన్నతాధికారులేమో నోట్ల రద్దు కేవలం రాజకీయ నిర్ణయమని చెబుతుండటంతో దేశవ్యాప్తంగా అయోమయం నెలకొంది. 14 రోజుల క్రితం పెద్ద నోట్ల రద్దును ప్రధానమంత్ర ప్రకటించటంతో యావత్ దేశంలో కలకలం రేగింది. మొదట్లో మోడి నిర్ణయానికి సానుకూలం కనిపించినా రోజులు గడిచే కొద్దీ వ్యతిరేకత మొదలైంది.
వారం గడిచేటప్పటికి దేశవ్యాప్తంగా గగ్గోలు మొదలైంది. దాంతో ప్రధాని నిర్ణయం అనాలోచితమని, తుగ్లక్ చర్యగాను విమర్శలు, ఆరోపణలు జోరందుకున్నాయి. ముందు నోట్ల రద్దును ప్రశంసించిన వారంతా తర్వాత మాట్లాడకపోవటంతో వ్యతిరేక ప్రచారం ఊపందుకున్నది.
అదే సమయంలో డబ్బుల కోసం క్యూలో నిలబడ్డ ప్రజల్లో పలువురు మరణిస్తుండటం, ఒత్తిడి తట్టుకోలేక బ్యాంకు అధికారులు కూడా మృతిచెందుతున్న ఘటనలు బయటకువచ్చాయి. సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు కూడా అప్పుడే మొదలవ్వటంతో ప్రతిపక్షాలన్నీ ఏకమై ప్రభుత్వాన్ని ఏకిపారేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా పెరిగిపోతున్న ఆందోళనలతో ప్రభుత్వం ఆత్మరక్షలో పడిపోయింది. దానికితోడు దేశవ్యాప్తంగా మోడిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు, విమర్శలు ఎక్కువవుతుండటంతో అధికార పార్టీ మోడిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని గుర్తించింది. వెంటనే బలిపశువుల కోసం వెతుకులాట మొదలైనట్లు కనబడుతోంది. అందులో భాగంగానే అఖిల భారత బ్యాంకు అధికారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు థామస్ ఫ్రాంకో ఆర్బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ పై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు.
సమస్య మొత్తానికి ఉర్జితే ప్రధాన బాధ్యత వహించాలని చెప్పటం గమనార్హం. తలెత్తిన సమస్యకు నైతిక బాధ్యగా ఉర్జిత్ ను రాజీనామా చేయమని కోరటం కీలకం. ఉర్జిత్ కాకపోయినా ఎవరో ఒకరిపై వేటు పడటం ఖాయంగా తెలుస్తోంది. అదే సమయంలో నీతి అయోగ్ ఉపాధ్యక్షుడు పనగారియా మాట్లాడుతూ, నోట్ల రద్దు లాంటి కీలక నిర్ణయాలు రాజకీయ నిర్ణయాలుగా చెప్పటం గమనార్హం. రాజకీయ నేతలు తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయటం మాత్రమే అధికారుల బాధ్యతగా స్పష్టం చేసారు. దాంతో మొత్తం వ్యవహారాన్ని శాంతింప చేయటానికి బలిపశువు కోసం అధికార పార్టీ వెతుకుతున్నట్లు స్పష్టమవుతోంది.
