టిడిపి ఎంఎల్ఏలను ఉద్దేశించి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఒకవిధంగా టిడిపిలో ప్రకంపనలే సృష్టిస్తోంది. ప్రభుత్వంలో పెరిగిపోయిన అవినీతితో పాటు నారా లోకేష్ అవినీతి గురించి తనకు 40 మంది ఎంఎల్ఏలు ఫిర్యాదు చేశారని పవన్ బహిరంగ సభలో ఆరోపించిన సంగతి అందరకీ తెలిసిందే. మొన్న 14వ తేదీన గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ సదస్సులో చంద్రబాబు, లోకేష్ లపై చేసిన ఆరోపణలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అదే సమయంలో ప్రభుత్వ, లోకేష్ అవినీతిపై పవన్ తో చెప్పిన 40 మంది ఎంఎల్ఏలు ఎవరు? అన్న విషయమై చంద్రబాబునాయుడు సీరియస్ అయ్యారట. వారెవరో తెలుసుకోవాలంటూ పార్టీ నేతలతో పాటు ఇంటెలిజెన్స్ సిబ్బందికి పురమాయించారని ప్రచారం జరుగుతోంది. బహుశా గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన ఎంఎల్ఏలే అయిఉంటారని కూడా పార్టీలో చర్చ జరుగుతోంది.

వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసే అవకాశం రాదని నిర్దారించుకున్న ఎంఎల్ఏల్లో పలువురు పవన్ తో టచ్ లో ఉన్నట్లు ఇప్పటికే టిడిపిలో చర్చ జరుగుతోంది. అదే సమయంలో టిడిపిపై పెరిగిపోతున్న వ్యతిరేకత వల్ల వచ్చే ఎన్నికల్లో గెలవటం కష్టమని భావిస్తున్న ఎంఎల్ఏలు కూడా ఉన్నారట. అటువంటి వారిలో కొందరు జనసేనలో చేరి అక్కడ నుండి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారని సమాచారం. అటువంటి ఎంఎల్ఏలే పవన్ తో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో జరుగుతున్న వ్యవహారాలు, చంద్రబాబు, లోకేష్ గురించి చెప్పే అవకాశాలున్నాయని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు.