ఎమ్మెల్యే తాలూకా, మంత్రి తాలూకా.. మీ బండి నంబర్ ప్లేట్‌పై అలా రాశారా? అయితే జాగ్రత్త!
ప్రతి వాహనదారుడు తమ వాహనం నంబర్ ప్లేటుపై ఏం రాయవచ్చు, ఏం రాయకూడదో తెలుసుకోవడం అవసరం. నిబంధనల ప్రకారం వాహనం నంబర్ ప్లేటుపై కేవలం రిజిస్ట్రేషన్ నంబరు మాత్రమే ఉండాలి.
నచ్చిన బైక్ లేదా కారు కొనాలనేది ప్రతి ఒక్కరి కల. కొందరు తమకు నచ్చిన వాహనాన్ని కష్టపడి కొంటారు. మరికొందరికి అమ్మా, నాన్న లేదా ఇతర కుటుంబ సభ్యులు బహుమతి కొనిస్తుంటారు. ఈ అనందంలో బైక్ లేదా కార్‌ని రకరకాలుగా ముస్తాబు చేస్తుంటారు. రకరకాల డిజైన్లలో నంబర్ ప్లేట్లు తయారు చేసి అమరుస్తారు. ఆ నంబర్ ప్లేటుని నంబరుతో మాత్రమే వదిలేస్తారా అంటే చాలా మంది నుంచి కాదని సమాధానం వస్తుంది.
వాహనం నంబర్ల ప్లేటుపై కొంత మంది పేర్లు రాయిస్తే, మరికొందరు కొటేషన్స్ రాయిస్తుంటారు. ఇప్పుడు కొత్తగా తెలుగు రాష్ట్రాల్లో ఓ ట్రెండ్ మొదలైంది. డిప్యూటీ సీఎం తాలూకా, ఫలానా ఎమ్మెల్యే తాలూకా, మంత్రి తాలూకా అంటూ నంబర్ ప్లేట్లపై రాయిస్తున్నారు. అయితే, మోటారు వాహన చట్టం ప్రకారం ఇలా చేయడంపై నిషేధం ఉంది. నంబరు ప్లేటుపై నంబరు కాకుండా వేరేమైనా రాస్తే చట్టపరంగా తీసుకొనే చర్యలకు బాధ్యలు కావాల్సి ఉంటుంది.
అసలు చట్టం ఏం చెబుతుంది..? వాహనాల నంబర్ ప్లేటు ఏం రాయవచ్చు.. ఏం రాయకూడదో ఇప్పుడు తెలుసుకుందా..
ఇవి స్పష్టంగా కనిపించాలి...
మన దేశంలో అన్ని మోటారు వాహనాలను నమోదు లేదా అనుమతి సంఖ్యతో గుర్తిస్తారు. రహదారులపై ప్రయాణించటానికి ప్రధాన అధికారపత్రంగా హై సెక్యూరిటీ వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఆయా రాష్ట్రాల జిల్లాస్థాయి, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు (ఆర్టీఓ) జారీ చేస్తాయి. నంబర్ ప్లేట్ వాహనం ముందు, వెనుక భాగంలో అమరుస్తారు.
ఈ నంబర్ ప్లేట్లపై వాహనానికి ప్రత్యేకంగా కేటాయించిన అంకెలు, అక్షరాలు తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది. అది కూడా నిర్దేశిత సైజు, ఫాంటు, రంగులో అక్షరాలు, అంకెలు ఉండాలి. ఈ నంబర్ ప్లేట్లు రిఫ్లెక్టివ్ ఫిల్మ్, క్రోమ్-బేస్డ్ హోటా స్టాంప్‌తో ఉండాలి. వాహనం నంబర్ ప్లేటుపై ఇండియా అనే పదం, దేశం గుర్తు తప్పనిసరిగా ఉండాలి. వాహనం నమోదైన రాష్ట్రం, ప్రాంతం గుర్తించే కోడ్‌లు మాత్రమే ఉండాలి.
ఇవి రాయకూడదు...
వాహనం నంబర్ ప్లేట్ (High Security Registration Plates)పై వ్యక్తిగత సందేశాలు, పేర్లు, టైటిల్స్ రాయటం భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం నిషేధం. వ్యాపార ప్రకటనలు, కంపెనీ పేర్లు, లేదా రాజకీయ పార్టీ గుర్తులు వాహనం నంబర్ ప్లేటుపై రాయకూడదు. నంబర్ ప్లేటుపై ఫాన్సీ రంగులు లేదా ఆకట్టుకునే రంగులు ఉపయోగించరాదు. RTA చట్టం ప్రకారం నంబర్ ప్లేట్ రంగు తెలుపు బేస్‌పై నలుపు అక్షరాలు/అంకెలు మాత్రమే ఉండాలి. ప్రత్యేకించి స్టిక్కర్లు, గుర్తులు అంటించకూడదు.
చట్టాలు ఏమంటున్నాయి?
సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ (CMVR) 50, 51లోని నిబంధనల్లో వాహన నంబర్ ప్లేట్ల డిజైన్, సైజు, వాటిపై ఉండాల్సిన వివరాలు గురించి స్పష్టంగా ఉంది. వాహనాలు భారతీయ మోటార్ వాహన చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ నంబర్ ప్లేట్లను ఉపయోగించాలి. ధృడమైన అల్యూమినియం, రిఫ్లెక్టివ్ ఫిల్మ్, లేజర్-ఎచ్చింగ్ టెక్నాలజీ ద్వారా తయారు చేసిన వాటినే వినియోగించాలి. నంబర్ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించడం లేదా మార్చడం చట్టపరమైన నేరం. ఇలా చేస్తే వాహనదారుడికి జరిమానాలు విధించే అవకాశం ఉంది.
నంబరు ప్లేటుపై అనవసర పదాలు రాయడం వల్ల ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించవచ్చు. నంబరు ప్లేటుపై నినాదాలు, ప్రకటనలు రాస్తే వాహనాలను ట్రాఫిక్ అధికారులు సీజ్ చేసే అవకాశం కూడా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో ట్రెండ్ అవుతున్నట్లు ఎమ్మెల్యే తాలూకా లేదా మంత్రి తాలూకా లాంటి పదాలు వాహనం నంబరు ప్లేటుపై రాయటం చట్ట విరుద్ధం. ఇలా నంబర్ల ప్లేట్లపై రాసుకొని తిరుగుతున్న వాహనదారులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. విశాఖలో ఇప్పటికే 22 కేసులు నమోదు చేశారు. అలాగే, రూ.22,700 జరిమానా కూడా విధించారు.