2014  ఎన్నికల ప్రచారం తర్వాత మొదటిసారి ప్రధాని మోడీ రాజకీయ పర్యటనకు వస్తున్నారు. జనవరి  2 లేదా 3 తేదీలలో తిరుపతి లో  బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అపుడు ప్రత్యేక హోదా హామీ  ఇచ్చిందిక్కడే.  ఇపుడేమంటారో చూడాలి.

ప్రధాని నరేంద్ర మోడీ తిరుపతి వస్తున్నారు. భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో పటిష్ట పరిచేందుకు ఉద్దేశించిన ఒక బహిరంగ సభలో ప్రసంగించేందుకు ప్రధాని తిరుపతి వస్తున్నారు. బహుశా ప్రధాని బాధ్యతలు స్వీకరించాక ఇదే మొదటి రాజకీయ పర్యటన కావచ్చు. మొదటి సారి ఆయన 2014 మే ఒకటో తేదీన ప్రధాని మంత్రి అభ్యర్థిగా తిరుపతి పర్యటనకు వచ్చారు. అపుడు తెలుగుదేశం పార్టీ అధ్య క్షుడుచంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తో కలసి ఎన్నికల ప్రచారం లో పాల్గొన్నారు. తర్వాత రెండు సార్లు రాష్ట్రానికి వచ్చారు.

ఒక సారి హుద్ హుద్ తాకిడి తర్వాత విశాఖను ప్రధానిగా సందర్శించారు. రెండో సారి సరిగ్గా ఏడాది కిందట అక్టోబర్ 22న అమరావతి శంకుస్థాపన కొచ్చారు. ఈ కార్యక్రమం చివర తిరుపతి కొచ్చి వెంకన్నను దర్శించుకున్నారు. అయితే, అవేవీ రాజకీయపర్యటనలు కాదు. అందువల్ల ప్రధాని అయిన తర్వాత మోదీ జరుపుతున్న మొదటి రాజకీయ పర్యటన తిరుపది సందర్శనే అవుతుంది. 2017 జనవరి మొదటి వారంలో ఉంటున్నది. బిజెపి వర్గాల ప్రకారం జనవరి రెండో తేదీన లేదా మూడో తేదీన తిరుపతి బహిరంగసభలో ప్రధాని ప్రసంగిస్తారు.

అయితే, తిరుపతి సమావేశానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ఎందుకంటే, 2014 ఎన్నికల ప్రచారం సమయంలో, బిజెపి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది తిరుపతి సభలోనే. అధికారంలోకి వచ్చాకమోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా మీద వెనకంజ వేసింది. చాలా కాలం విభజన బిల్లులో ప్రత్యేక హోదా ప్రస్తావన లేదని వాదిస్తూ చివరకు ప్రత్యేక హోదా తో సమానమయిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం తప్పించుకుంది.

ప్రత్యేక ప్యాకేజీతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సంతృప్తి చెందుతూ ఉండవచ్చ గాని, రాష్ట్రంలో రాజకీయ పార్టీలేవీ సంతృప్తిగా లేవు. చివరకు ప్రధానికి మిత్రుడయిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా అగ్రహంతో ఉన్నారు. అన్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఉద్యమంచేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ ఈ నెల పదో తేదీన అనంతపురం ప్రత్యేక హోదా బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. నవంబర్ ఆరో తేదీన ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి విశాఖలో ’ జై ఆంధ్ర ప్రదేశ్’ నినాదంతో ప్రత్యేక హోదా కోసం కొత్త ఉద్యమానికి పూనుకుంటున్నారు.

జనవరి రెండో తేదీన ప్రధాని తిరుపతికి వచ్చే నాటికి ఈ ఉద్యమం మరింత వూపందుకుంటుంది.ప్రధాని వస్తున్న విషయం పవన్ కల్యాణ్ కు కూడా తెలుసు కాబట్టి అనంతపురం సభలో ప్రత్యేక హోదా మీద ప్రధానిని ఆయన వివరణ కోరవచ్చు. ఇది బిజెపి సభ కాబట్టి ప్రధాని సభలో పవన్ పాల్గొనే అవకాశం లేదు.

విశాఖ లో జగన్ కూడా ఇదే ప్రశ్న వేయవచ్చు. బిజెపిని బలపర్చండని అడిగే ముందు ఆయన తన గత పర్యటనను గుర్తుచేసుకొనక తప్పదు. అపుడు తను చేసిన ప్రత్యేక హోదా హామీ తప్పక గుర్తొస్తుంది. 

దీనికి ఏమి చెబుతారో చూడాలి. ప్రత్యేక హోదా కంటే తాము ప్రకటించిన ప్ర త్యేక ప్యాకేజీ గొప్పదని తెలుగు ప్రజలకు నచ్చచెబుతారా లేక జాతీయ భద్రత వంటి సీరియస్ విషయాలు ప్రస్తావించి ప్ర త్యేక హోదాని దాట వేస్తారా ?