నంద్యాల: కర్నూల్ జిల్లా నంద్యాలలో దంత వైద్యురాలు మాధవీలత ఆత్మహత్య ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఆత్మహత్య చేసుకొన్న డెంటిస్ట్ మాధవీలత సూసైడ్ నోటు రాసిందని పోలీసులు చెప్పారు. అయితే ఈ నోట్ లో ఏముందనే విషయమై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది.

కడప జిల్లాలోని ప్రొద్దుటూరుకు చెందిన లక్ష్మణ కిశోర్, గుంటూరుకు చెందిన మాధవీలత మెడిసిన్ చదువుకొనే సమయంలో ప్రేమించుకొన్నారు. 20 ఏళ్ల క్రితం వీరిద్దరూ కులాంతర వివాహం చేసుకొన్నారు.  పెళ్లి చేసుకొన్న తర్వాత నంద్యాలలోని శ్రీనివాస్ సెంటర్ లో స్వంతంగా శ్రీరమణ కాస్మోటిక్ డెంటల్ ఆసుపత్రిని నడుపుతున్నారు. వీరికి మెడిసిన్ చదివే కుమారుడు ఉన్నారు.

నంద్యాలలోని భరతమాత ఆలయం వద్ద ఇల్లు కొనుగోలు చేసి అక్కడే నివాసం ఉంటున్నారు.  ఈ నెల 16వ తేదీన మాధవీలత తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేవని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. 

ఆత్మహత్య చేసుకొనే ముందు డాక్టర్ మాధవీలత సూసైడ్ నోట్ రాసింది. ఈ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈ నోట్ లో ఏముందనే విషయాన్ని  పోలీసులు బయటపెట్టలేదు. కేసు దర్యాప్తులో భాగంగానే నోట్ ను బయట పెట్టడం లేదని  పోలీసులు ప్రకటించారు. 

ఎలాంటి ఇబ్బందులు లేని డాక్టర్ మాధవీలత ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే విషయమై సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ విషయమై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నట్టుగా చెబుతున్నారు.